Begin typing your search above and press return to search.

కొత్త చరిత్ర: రజినీకాంత్-కమల్ హాసన్ పొత్తు?

By:  Tupaki Desk   |   1 March 2020 7:44 AM GMT
కొత్త చరిత్ర: రజినీకాంత్-కమల్ హాసన్ పొత్తు?
X
తమిళనాట అమ్మ జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసే నేత లేరు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు ప్రత్యామ్మాయంగా ఇప్పుడు రాజకీయంగా ఎదగాలని కమల్ హాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ పెట్టాడు. కానీ కమల్ తో వర్కవుట్ కాలేదు. ఆయన పార్టీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలపడింది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. దీంతో రజినీ పార్టీతో పొత్తు పెట్టుకొని తమిళనాట థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కమల్ హాసన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.. డీఎంకే, అన్నాడీఎంకేలకు సంబంధం లేని అవినీతి వ్యతిరేక పార్టీలతో కలిసి మూడో ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్టు కమల్ తెలిపారు.

రజినీకాంత్, కమల్ కు మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే తనతో కానిదీ.. రజినీతో అవుతుందని కమల్ నమ్ముతున్నారు. అయితే ఒంటరిగా వెళితే ఇద్దరూ అధికారంలోకి రాలేరు. అందుకే ఏక భావజాలం కలిగిన రజినీకాంత్-కమల్ లు ఒక్కటి కావడానికి చర్చలు జరుపుతున్నారట..

అయితే అధికారంలోకి వస్తే కమల్ - రజినీకాంత్ లలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరి ఆధ్వర్యంలో కూటమి నడవాలనేది ఇప్పుడు సమస్యగా మారిందట..

దీనికి కమల్ హాసన్ వివరణ ఇచ్చాడు. ఎవరు ముఖ్యమంత్రి అయినా తమిళ ప్రజలకు మేలే తమకు ముఖ్యమని.. కూటమి ఏర్పడిన తర్వాత నిర్ణయిస్తామని కమల్ హాసన్ ప్రకటించారు.

ఇక ఆ క్రమంలోనే రజినీకాంత్ హీరోగా తాను ఒక సినిమా నిర్మిస్తున్నానని.. ఇదే మా కూటమికి సంకేతమని కమల్ చెప్పుకొచ్చాడు.