Begin typing your search above and press return to search.

మ‌రో అనిత ఉండ‌కూదంటున్న హీరో సూర్య‌

By:  Tupaki Desk   |   6 Sep 2017 10:32 AM GMT
మ‌రో అనిత ఉండ‌కూదంటున్న హీరో సూర్య‌
X
కోట్లాదిమందిని ప్ర‌భావితం చేసే అంశాల మీద నిర్ణ‌యం తీసుకునేట‌ప్పుడు విస్తృతంగా క‌స‌ర‌త్తు చేసిన త‌ర్వాత మాత్ర‌మే తుది నిర్ణ‌యం తీసుకోవాలి. ఇంత‌పెద్ద దేశంలో.. దేశ వ్యాప్తంగా ఒక నిర్ణ‌యాన్ని అమలు చేయాల‌న్న‌ప్పుడు చాలానే క‌స‌రత్తు జ‌ర‌గాలి. అందునా విద్యార్థుల విష‌యంలో మ‌రింత జాగ్రత్త అవ‌స‌రం. ఎందుకంటే.. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ విద్య బోధ‌న ఒక‌టిలా ఉండ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న ఏపీ.. తెలంగాణ‌.. త‌మిళ‌నాడు.. క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో విద్యా బోధ‌న ఒక‌లా ఉండ‌దు. అలాంటిది దేశ వ్యాప్తంగా మెడిక‌ల్ ఎంట్ర‌న్స్‌ కు సంబందించి ఒకేలాంటి ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని అనుకున్న‌ప్పుడు.. అందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు చాలానే ఉంటాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. వైద్య‌కోర్సును అభ్య‌సించేందుకు నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్‌) మీద ఉన్న అభ్యంత‌రాలు అన్ని ఇన్ని కావు.

విద్యార్థులు.. విద్యా సంఘాలు..ఆయా రాష్ట్రాల మేధావులు లేవ‌నెత్తుతున్న అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని వైనానికి నిద‌ర్శ‌నంగా త‌మిళ‌నాడులోని ఒక మెరిట్ విద్యార్థిని (ఎస్‌. అనిత‌) బ‌ల‌వ‌న‌ర్మ‌ణానికి గురైంది. ఆమె ఆత్మ‌హ‌త్య త‌మిళ‌నాడును ర‌గిలిపోయేలా చేసింది. నీట్‌కు వ్య‌తిరేకంగా స‌ద‌రు ద‌ళిత విద్యార్థిని ప్రారంభించిన పోరాటానికి ఇప్పుడు త‌మిళ‌నాడు ప్ర‌ముఖులంతా త‌మ మ‌ద్ద‌తును తెలుపుతున్నారు. ఇంతమందిని క‌దిలించిన అనిత ప్రాణాల‌తో లేక‌పోవ‌టం అస‌లైన విషాదంగా చెప్పాలి.

నీట్ ప‌రీక్ష నుంచి త‌మిళ‌నాడును మిన‌హాయించాల‌న్న‌ది డిమాండ్‌. కానీ.. అందుకు కేంద్రం నో చెప్పేయ‌టంతో త‌న క‌ల అయిన మెడిసిన్ సీటు రాద‌న్న వేద‌న‌తో అనిత ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమె ఏమైనా టాలెంట్ లేని విద్యార్థినినా? అంటే లేద‌నే చెప్పాలి. ఆమెకు వ‌చ్చిన మార్కులు తెలిస్తే నోటి వెంట మాట రాదు. ఎందుకంటే.. ఇంట‌ర్ లో ఆమెకు 1200 మార్కుల‌కు 1176 మార్కులు వ‌చ్చాయి. మెడిసిన్ క‌ట్ ఆఫ్ లో 196.76 మార్కులు వ‌చ్చాయి. అయితే.. నీట్ ప‌రీక్ష‌లో మాత్రం ఆమెకు కేవ‌లం 86 మార్కులే వ‌చ్చాయి. దీంతో ఆమెకు ఎంబీబీఎస్ సీటు రాకుండా చేసింది.

ఇంట‌ర్ మార్కుల్ని ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే త‌న‌కు మెడిక‌ల్ సీటు వ‌స్తుంద‌ని.. ఆమె త‌న అప్పీల్ లో వేడుకుంది. అయిన‌ప్ప‌టికీ నో చెప్పేయ‌టంతో సెందురై స‌మీపంలోని కుజుమూర్ గ్రామానికి చెందిన అనిత బ‌ల‌వంతంగా త‌న ప్రాణాల్ని తీసుకుంది. నీట్ ఆధారంగానే మెడిక‌ల్ ఆడ్మిష‌న్స్ తీసుకోవాలంటూ సుప్రీం స్ప‌ష్టం చేయ‌టంతో నిరాశ‌కు గురైన అనిత ప్రాణాలు తీసుకుంది.

అనిత ఆత్మ‌హ‌త్య‌పై త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స్పందించారు. చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న‌గా ఆయ‌న చెప్పారు. రాజ‌కీయ బేర‌సారాల‌తో ప్ర‌భుత్వం నిరుప‌యోగంగా మారిందంటూ త‌మిళ‌నాడు రాష్ట్ర స‌ర్కారును త‌ప్పు ప‌ట్టిన ర‌జ‌నీకాంత్ త‌న తీరుకు భిన్నంగా ఈ ఉదంతంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఒక్క ర‌జ‌నీనే కాదు.. త‌మిళ‌నాడు విప‌క్ష నేత స్టాలిన్ తో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు అనిత ఆత్మ‌హ‌త్య‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రం తీరును.. రాష్ట్ర స‌ర్కారు తీరును త‌ప్పు ప‌ట్టారు. ఇక‌.. విద్యార్థి లోక‌మైతే కోపంతో ఊగిపోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌ముఖ హీరో సూర్య ఈ ఘ‌ట‌న మీద స్పందించారు. అనిత విష‌యంలో జ‌రిగిన దారుణం మ‌రోసారి జ‌ర‌గ‌కూడ‌ద‌ని.. స‌మాజంలో మ‌రో అనిత ఉండ‌కూడ‌ద‌న్నారు. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా మ‌న పిల్ల‌ల కోసం చేతులు క‌లుపుదామ‌న్నారు. ఇంత మందిని క‌దిలిస్తున్న ఈ అంశం.. కేంద్రాన్ని మాత్రం ఎందుకు క‌ద‌ల‌కుండా చేస్తున్న‌ట్లు..?