Begin typing your search above and press return to search.

భారీ ఛాలెంజ్ విసిరిన ర‌జ‌నీకాంత్‌!

By:  Tupaki Desk   |   31 Dec 2017 6:52 AM GMT
భారీ ఛాలెంజ్ విసిరిన ర‌జ‌నీకాంత్‌!
X
ఏళ్ల‌కు ఏళ్లుగా సాగుతున్న స‌స్పెన్స్‌కు తెర ప‌డింది. అవును.. త‌మిళ రాజ‌కీయాల్లో స‌రికొత్త సంచ‌ల‌నం సృష్టించేందుకు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేయ‌నున్నారు. గ‌తంలో వినిపించిన ప‌లు అంచ‌నాల్ని వ‌మ్ము చేస్తూ.. తాను సొంతంగా పార్టీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేనా.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి త‌న రాజ‌కీయ పార్టీ సీన్లోకి వ‌స్తుంద‌ని.. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని చెప్పేశారు
.
దీంతో.. త‌న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించి త‌న‌కెంత క్లారిటీ ఉంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పేశారు. అభిమానుల‌తో భేటీ కావ‌టం అనే ప్రోగ్రాంను రెండో సారి షురూ చేసిన ఆయ‌న‌.. గ‌డిచిన ఐదు రోజులుగా త‌మిళ‌నాడు వ్యాప్తంగా వ‌స్తున్న అభిమానుల్ని క‌లుస్తూ.. వారితో ఫోటోలు దిగుతూ అంద‌రిని సంతృప్తి ప‌రుస్తున్నారు.

ఆరో రోజున ర‌జ‌నీ నోటి నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న వ‌స్తుందోన‌న్న సందేహంగా చూస్తున్న వారి డౌట్లు తీరుస్తూ త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై మ‌రెలాంటి క‌న్ఫ్యూజన్ లేకుండా చెప్పాల్సిన ముఖ్య‌మైన విష‌యాల్ని చెప్పేశారు.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను బ‌రిలోకి దిగుతాన‌ని చెప్ప‌టంతో పాటు.. తాను సొంతంగా రాజ‌కీయ పార్టీ పెడ‌తాన‌ని చెప్పేశారు. స‌త్యం.. ప‌ని.. అభివృద్ధి అనే మూడు మంత్రాల‌తో త‌న పార్టీ న‌డుస్తుంద‌ని చెప్పిన ఆయ‌న‌.. ఇప్పుడు కాకుంటే మ‌రెప్ప‌టికీ కాద‌న్న మాట‌ను చెప్ప‌టంతో పాటు.. తానిప్పుడు రాజ‌కీయ పార్టీ పెట్ట‌క‌పోతే పెద్ద త‌ప్పిదం అవుతుందంటూ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ అవ‌స‌రాన్ని చెప్పేశారు.

రాజ‌కీయాలు త‌న‌కు కొత్తేం కాద‌న్న ఆయ‌న‌.. తాను 1996 నుంచి రాజ‌కీయాల్లోనే ఉన్నాన‌ని చెప్పారు. ప్ర‌జాస్వామ్యం పేరుతో కొంద‌రు నేత‌లు దోచుకుంటున్నార‌ని చెప్పిన ర‌జ‌నీ.. త‌న రాజ‌కీయ అరంగ్రేటం సంద‌ర్భంగా ఊహించ‌ని రీతిలో స‌వాలు విసిరారు. తాను ఇచ్చిన హామీల్ని.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల వ్య‌వ‌ధిలోనే పూర్తి చేస్తామ‌ని.. ఒక‌వేళ తానిచ్చిన హామీల్ని అమ‌లు చేయ‌ని ప‌క్షంలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ చాలెంజ్ విసిరారు. రాజ‌కీయాల్లోకి రావ‌టం.. పార్టీలు పెట్ట‌టం మామూలే. ఎన్నిక‌ల వేళ‌లో హామీలు ఇవ్వ‌టం మామూలే అయినా.. వాటికి టైమ్ లైన్ పెట్టి.. ఆ లోపు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుంటే ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తాన‌ని.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశం రోజునే చెప్ప‌టం మాత్రం ర‌జ‌నీ స్పెషాలిటీగా చెప్ప‌క త‌ప్ప‌దు.