Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ లోకి వ‌స్తున్నా..ర‌జ‌నీ!

By:  Tupaki Desk   |   31 Dec 2017 5:00 AM GMT
పాలిటిక్స్ లోకి వ‌స్తున్నా..ర‌జ‌నీ!
X
ఉత్కంట తీరిపోయింది. ఏళ్ల‌కు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశంపై త‌న‌కు తానే స్ప‌ష్ట‌త ఇచ్చేశారు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌. కొత్త సంవ‌త్స‌రానికి ఒక్క‌రోజు ముందు.. ఈరోజు (ఆదివారం) ఉద‌యం రజ‌నీకాంత్ త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నాట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇప్పటి వ‌ర‌కూ కాలం.. దేవుడు అన్న మాట‌లు చెబుతూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పేందుకు వాయిదాల మీద వాయిదాలు వేసిన ర‌జ‌నీ.. తాజాగా మాత్రం త‌న రాజ‌కీయ అరంగ్రేటానికి సంబంధించిన వివ‌రాల్ని స్ప‌ష్టంగా వెల్ల‌డించారు.

గ‌డిచిన ఐదు రోజులుగా అభిమానుల‌తో స‌మావేశం అవుతున్న ఆయ‌న‌.. ఈ రోజు ఉద‌యం రాఘ‌వేంద్ర హాలులో అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజ‌కీయాల‌కు భ‌య‌ప‌డ‌న‌ని.. మీడియా అంటే భ‌య‌మ‌ని న‌వ్వుతూ చెప్పిన ఆయ‌న‌.. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ర‌జ‌నీ నిర్ణ‌యంతో అక్క‌డున్న ఆయ‌న అభిమానులు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశారు. తాను కొత్త‌గా పార్టీ పెడుతున్న‌ట్లు చెప్పారు ర‌జ‌నీ.

పేరు కోసం.. డ‌బ్బు కోసం తాను రాజ‌కీయాల్లోకి రావ‌టం లేద‌ని.. వ్య‌వ‌స్థ‌లో మార్పు కోస‌మే తాను పాలిటిక్స్ లోకి వ‌స్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. రాజ‌కీయాల్లో మార్పు తెచ్చేందుకు ఇదే స‌రైన టైమ‌న్న ర‌జ‌నీ.. ఇప్పుడు కూడా రాజ‌కీయాల్లోకి రాకుంటే త‌మిళ ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేసిన వాడిన‌వుతాన‌ని వ్యాఖ్యానించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని.. ఇంత‌కాలం త‌న వెన్నంటి ఉన్న అభిమానుల‌కు.. త‌మిళ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు.

ర‌జ‌నీ త‌న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌కు కొద్ది క్ష‌ణాల ముందు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశ ప్ర‌ట‌క‌న‌కు కొద్ది నిమిషాల ముందు ధ్యాన‌ముద్ర‌లో ఉన్న ర‌జ‌నీ.. క‌ర్మ‌ణ్యే వాధికార‌స్తే అంటూ త‌న ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంత‌రం త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చివ‌ర్లో జైహింద్ అంటూ త‌న ప్ర‌సంగాన్ని ముగంచారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న ర‌జ‌నీ నోటి నుంచి వ‌చ్చినంత‌నే ర‌జ‌నీ అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. త‌మిళ‌నాడు వ్యాప్తంగా ర‌జ‌నీ అభిమానులు సంబ‌రాలు చేసుకోవ‌టం షురూ చేశారు.

రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల లోపే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తాన‌న్నారు. త‌మిళ‌నాడులోని 234 స్థానాల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌న్నారు. యుద్ధం చేస్తాన‌ని.. గెలుపోట‌ములు దేవుడి ద‌య‌గా ర‌జ‌నీ పేర్కొన్నారు. యుద్ధం చేయ‌క‌పోతే పిరికివాడంటార‌న్నారు. డ‌బ్బు.. పేరు అన్నీ త‌న‌కు ఉన్నాయ‌ని.. వాటి కోసం తాను రాజ‌కీయాల్లోకి రావ‌టం లేద‌న్న ర‌జ‌నీ.. దేశంలో రాజ‌కీయాలు భ్ర‌ష్టుప‌ట్టిపోయాయ‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డిచిన కొద్దిరోజులుగా త‌మిళ‌నాడులో చోటు చేసుక‌న్న రాజ‌కీయ ప‌రిణామాలు త‌న‌కు మ‌న‌స్తాపాన్ని క‌లిగించాయ‌న్నారు.