Begin typing your search above and press return to search.

శివాలెత్తిన రజినీకాంత్.. అసలు కారణమిదే..!

By:  Tupaki Desk   |   10 May 2020 9:30 AM GMT
శివాలెత్తిన రజినీకాంత్.. అసలు కారణమిదే..!
X
మౌనముని.. ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయని రజినీకాంత్ తాజాగా శివాలెత్తిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. అధికార పార్టీపై ఒక్కసారిగా భగ్గుమన్నాడు. తమిళనాడులో మద్యం దుకాణాలను తెరవడాన్ని ఆయన తప్పు పట్టాడు. అలాంటి తప్పు చేయవద్దని హెచ్చరించాడు. మద్యం షాపులు గనుక తెరిస్తే జనం పాతరేస్తారని నిప్పులు చెరిగారు. ఇలా చేస్తే మీరు అధికారంలోకి రావడాన్ని మర్చిపోవాల్సిందేనని జోస్యం చెప్పారు.

కేంద్రం మూడో దశ లాక్ డౌన్ ఇచ్చిన సడలింపులతో తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం మద్యం షాపులను తెరిచింది. అక్కడి ప్రభుత్వమే వీటిని నిర్వహిస్తోంది. మార్కెటింగ్ శాఖలో ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది.

మూడో దశ లాక్ డౌన్ లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలను తెరచుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచారు. తమిళనాడులో మాత్రం ఆలస్యంగా కొన్ని మాత్రమే షాపులు తెరిచారు. దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు రజినీకాంత్.

ఇప్పటికే తమిళనాడులో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని.. మద్యం దుకాణాలను తెరిస్తే ఇక అన్నాడీఎంకే అధికారంలోకి రాదని హెచ్చరించారు. ప్రజలు ఎవరూ మద్యం అమ్మకాలను కొనసాగించాలని కోరుకోవట్లేదన్నారు.జనాభీష్టానికి వ్యతిరేకంగా వెళితే తన గొయ్యిని తానే తవ్వుకున్నట్టు అవుతుందని హెచ్చరించారు. ఖజానా నింపుకోవడానికి ప్రత్యామ్మాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు.

రజినీకాంత్ ఇలా ఓ పార్టీపై ఇంత సీరియస్ గా మాట్లాడడం ఇదే తొలిసారి. అన్నాడీఎంకేపై రజినీ ఇప్పటిదాకా వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీజేపీ-అన్నాడీఎంకేతో ఆయన సన్నిహిత్యం నెరుపుతున్నారు. అలాంటి సడన్ గా రజినీకాంత్ ఇలా ఫ్లేట్ ఫిరాయించడం తమిళనాడు పాలిటిక్స్ లో హీట్ పెంచింది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే సొంతంగా ఎదిగేందుకు మద్యంషాపులను రజినీకాంత్ అస్త్రంగా ఉపయోగించుకున్నాడని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.