Begin typing your search above and press return to search.
కరుణానిధితో రజనీ కి ఏం పని?
By: Tupaki Desk | 3 Jan 2018 5:24 PM GMT‘నా దారి.. రహదారి’ అంటూ సినిమాల్లో చాలా క్లారిటీ చూపించే సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయాల్లో మాత్రం ఎవరికీ అర్థం కాని దారిలో పయనిస్తున్నారు. ఆయన ఏం చేయబోతున్నారు.. ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తారా... లేదంటే ఇంకేదైనా పార్టీతో కలుస్తారా... అది రాష్ర్టంలోని పార్టీయా - జాతీయ పార్టీయా అన్నది ఏమాత్రం అర్థం కాని రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారు. ఆధ్యాత్మిక భావనలు దండిగా ఉన్న ఆయన ఎంతైనా బీజేపీకి అనుకూలంగా ఉంటారని అంతా భావిస్తున్న తరుణంలో ఆయన తన ఆధ్యాత్మిక చిహ్నంలో ఉన్న కమలం బొమ్మను తొలగించి బీజేపీ ముద్ర కనిపించకుండా చేశారు. తాజాగా డీఎంకే అధినేత కరుణానిధిని కలిసి ఇంకో ట్విస్టు ఇచ్చారు.
చెన్నైలోని గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసానికి రజనీ వెళ్లారు. అక్కడ కరుణను కలిసి ఆయనతో ముచ్చటించారు.పార్టీ పెడతానని చెప్పి పట్టుమని పది రోజులైనా కాకుండానే ఆయన ఇంకో ప్రధాన పార్టీ అధినేత వద్దకు వెళ్లడం ఆయన అభిమానులను గందరగోళ పరుస్తోంది.
కాగా... రజినీ మాత్రం దీనికి తన వెర్షన్ తాను చెబుతున్నారు. కరుణానిధి తనకు చిరకాల మిత్రుడని... ఆయన్ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని మీడియాకు చెప్పారు. తమ మధ్య రాజకీయాలేమీ చర్చకు రాలేదని అన్నారు.
అయితే తమిళ నాట మాత్రం రజనీ అడుగులు ఎటువైపు అన్నది అర్థం కాక అంతా తలలు పట్టుకుంటున్నారు. రాజకీయ నాయకులు, పార్టీలు మధ్య స్పష్టమైన విభజన ఉండే తమిళనాడులో ఇలా రజినీ ఎవరికి అర్థం కాని రీతిలో వ్యవహరిస్తుండడం చర్చకు దారితీస్తోంది. ఎంత పాత మిత్రుడైతే మాత్రం రాజకీయ పార్టీ పెడతానని చెప్పాక ఇలా కలవడం వెనుక కారణమేంటని.. కరుణతో ఆయనకు ఏం పని అని అంటున్నారు.