Begin typing your search above and press return to search.

రజినీ స్టెప్.. తమిళనాట వేడి రాజుకుంది..

By:  Tupaki Desk   |   25 Sep 2019 5:49 AM GMT
రజినీ స్టెప్.. తమిళనాట వేడి రాజుకుంది..
X
తమిళ అమ్మ జయలలిత మరణించింది. ఆమె మరణంతో తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇక ఇదివరకే రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారు. కమల్ పై ఆశలు అడియాసలయ్యాయి. మరి తమిళనాడు రాజకీయాలను ఏలేది ఎవరు? అన్న ఆందోళనలు వెంటాడుతున్న వేళ రజినీకాంత్ తీపి కబురు ఒకటి చెప్పారు..

రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని దాదాపు రెండు దశాబ్ధాలుగా ఆయన అభిమానులు కోరుతున్నారు. ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కానీ వారు కళ్లు కాయలు కాసి పండ్లుగా మారుతున్నా రజినీ మాత్రం రాజకీయ అరంగేట్రానికి మొగ్గుచూపకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా తప్పించుకుంటున్నారు.

అభిమానుల తీవ్ర ఒత్తిడితో 2017 డిసెంబర్ లో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అభిమాన సంఘాలను ప్రజాసంఘాలుగా మార్చి నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను చేశారు. కానీ ఇప్పటికీ పార్టీ ప్రకటన లేదు.. కార్యాచరణ లేదు. రజినీ రాజకీయాల్లోకి రాకుండా సినిమాలు చేసుకుంటూ పోతుండడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోవడం లేదు..

తాజాగా ముంబైలో రజినీకాంత్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలవడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. 2014లో మోడీని, 2019లో జగన్ ను ఏపీలో అఖండమెజార్టీతో ఇదే ‘పీకే’ గెలిపించారు. చాలా రాజకీయ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో గద్దెనెక్కించారు. అలాంటి పీకేతో రజినీకాంత్ సమావేశమయ్యారు. పీకే ఇటీవలే తమిళనాడులో చేసిన సర్వే వివరాలపై ఇద్దరూ చర్చించారట.. రజినీకి దగ్గరైన ప్రజాసంఘాల నిర్వాహకులు ఈ మేరకు ధ్రువీకరించారు. దీంతో రజినీకాంత్ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ అరంగేట్రం చేస్తారని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. ఇక రజినీ వస్తే తమ పరిస్థితి ఏంటని డీఎంకే, అన్నాడీఎంకేలు ఆందోళనగా ఉన్నాయట.. మొత్తంగా రజినీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తమిళనాట రాజకీయవేడిని రగిల్చాయి.