Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లోకి ర‌జ‌నీ...ఇంకా దాగుడుమూత‌లే

By:  Tupaki Desk   |   27 Nov 2018 12:30 PM GMT
రాజ‌కీయాల్లోకి ర‌జ‌నీ...ఇంకా దాగుడుమూత‌లే
X
సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై క్లారిటీ వ‌చ్చి..త్వ‌ర‌లో ఆయ‌న పార్టీ ఆవిర్భ‌వించ‌నున్న సంగ‌తి తెలిసిందే. బ్యాక్‌ గ్రౌండ్ వ‌ర్క్‌ లో బిజీగా ఉన్న ర‌జనీ తాజాగా ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేవారు. తమిళనాడు అసెంబ్లీకి ఆర్నెల్లలో ఎన్నికలు వచ్చినా తాను ఆ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నానని ర‌జ‌నీ వెల్లడించారు. త‌మిళనాడులో నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయ విప్లవం రావాల్సిన అవసరం ఉన్నదని రజనీకాంత్ పేర్కొన్నారు. అయితే, అనంత‌రం ఆయ‌న పార్టీ ప్ర‌క‌ట‌నపై స్ప‌ష్ట‌త రాలేదు. అదే స‌మ‌యంలో ఆయ‌న సినిమాల‌పై సీరియ‌స్‌ గా వ్య‌వ‌హ‌రించారు.త‌న త‌దుప‌రి సినిమా 2.ఓ రిలీజ్‌ పై ఫోక‌స్ పెట్టారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మంలో ర‌జ‌నీ రాజ‌కీయాల గురించి మాట్లాడ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం 2.ఓ. శంకర్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాష్‌కరణ్ నిర్మిస్తున్నారు. నిర్మాతలు దిల్‌ రాజు - ఎన్వీ ప్రసాద్ యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌ లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ నా తొలి సినిమా అపూర్వ రాంగంగళ్‌ ను తెరపై చూడటానికి ఎంత ఆసక్తిగా ఎదురుచూశానో 43 ఏళ్ల తర్వాత అదే తపన - ఉత్సుకతతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు.

ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ర‌జ‌నీ స‌మాధానాలు దాటవేశారు. తెలంగాణ‌లో జ‌రుగుత‌న్న ఎన్నిక‌లు - త‌న రాజ‌కీయ అరంగేట్రం గురించి విలేక‌రులు ప‌దే పదే ప్ర‌శ్న‌లు అడిగిన‌ప్పటికీ ర‌జ‌నీకాంత్ స‌మాధానాలు దాట‌వేశారు. రాజ‌కీయాల గురించి స్పందిస్తే త‌న సినిమా ప్ర‌మోష‌న్ దెబ్బ‌తింటుంద‌ని భావించారో లేక ఆ స‌మాధానాలు ఎటువైపు మ‌ళ్లుతాయో అనే సందేహం వ‌చ్చి ఆయ‌న స‌మాధానాలు ఇవ్వ‌కుండా చిరున‌వ్వుతో స‌రిపెట్టార‌ని అంటున్నారు. కాగా, మీడియా అడిగి ప్ర‌శ్న‌ల విష‌యంలో నిర్మాత దిల్‌ రాజు స‌ర్దిచెప్పారు. ``స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న కార‌ణంగా సినిమా గురించి మాత్ర‌మే ప్ర‌శ్న‌లు అడ‌గండి`` అని సూచించారు.