Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ...మ‌రో ఎంజీఆరా?, శివాజీనా?

By:  Tupaki Desk   |   31 Dec 2017 3:30 PM
ర‌జ‌నీ...మ‌రో ఎంజీఆరా?, శివాజీనా?
X
త‌మిళ సూప‌ర్ స్టార్‌, త‌మిళ తంబీలంతా త‌లైవా అంటూ ఆరాధ‌న‌గా పిలుచుకునే ర‌జనీకాంత్ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌యాణానికి నాందీ ప‌లికారు. నిన్న‌టిదాకా సినిమాల‌కే ప‌రిమిత‌మైన‌ ర‌జ‌నీ... ఇక‌పై రాజ‌కీయ రంగంలో త‌న‌దైన శైలిలో రాణించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేరకు నేటి ఉద‌యం ర‌జ‌నీ నోట చాలా కీల‌కమైన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసిన‌ట్టేన‌ని ప్ర‌క‌టించిన ర‌జ‌నీ... వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగుతార‌ని, ప్ర‌త్య‌క్ష యుద్ధ రంగంలోకి తాను దిగేసిన‌ట్టేన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ర‌జ‌నీ నోట నుంచి రాజ‌కీయ ప్రవేశం మాట కోసం చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఆయ‌న అభిమానులు... ఇప్పుడు సంబ‌రాలు మొద‌లుపెట్టేశారు. మొత్తంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నానంటూ ప్ర‌క‌టించిన ర‌జ‌నీకాంత్‌... ఒక్క తమిళ‌నాడులోనే కాకుండా దేశ‌వ్యాప్త రాజ‌కీయాల్లో పెద్ద చ‌ర్చ‌కే తెర తీశారు. ఇదివర‌కు బాగానే ఉన్నా... సినీ రంగంలో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న చాలా మంది ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశారు. వారిలో కొంద‌రు బంప‌ర్ విజ‌యాలు అందుకుంటే... మెజారిటీ మంది మాత్రం సినిమాల్లో మాదిరిగా రాజ‌కీయాల్లో ఏమాత్రం క్లిక్ కాలేక‌పోయారు. ఈ క్ర‌మంలో అశేష అభిమాన గ‌ణ‌మున్న ర‌జ‌నీ.. ఇందులో ఏ కోవ‌కు చెందుతార‌న్న చ‌ర్చ ఇప్పుడు జోరందుకుంది.

ర‌జ‌నీ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి ముందుగా సినిమాల్లో నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నేత‌ల‌ను ఓ సారి స్మ‌రించుకుంటే... త‌మిళ‌నాడులోనే ఈ త‌ర‌హా రాజ‌కీయాలు తొలుత చోటుచేసుకున్నాయ‌ని చెప్పాలి. నాడు త‌మిళ సినీ రంగంలో తిరుగులేని న‌టుడిగా పేరొందిన ఎంజీ రామ‌చంద్ర‌న్‌... అప్ప‌టి రాజ‌కీయాల‌పై సునిశిత ప‌రిశీల‌న చేసి.. రాజ‌కీయాల‌ను క‌డిగిపారేద్దామ‌ని ఎంట్రీ ఇచ్చారు. అప్ప‌టిదాకా సినిమా వాళ్లు ఎవ‌రు కూడా రాజ‌కీయాల్లోకి పెద్ద‌గా వ‌చ్చిన దాఖ‌లా లేక‌పోవ‌డం, అదే స‌మ‌యంలో త‌మ ఆరాధ్య న‌టుడిగా ఉన్న ఎంజీఆర్‌ను ఆద‌రిస్తే త‌ప్పేమేముంద‌న్న కోణంలో యోచింని త‌మిళ తంబీలు... ఎంజీఆర్‌ను బంప‌ర్ మెజారిటీతో గెలిపించారు. త‌ద్వారా ఎంజీఆర్ స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పేందుకు తంబీలే కార‌ణ‌మ‌య్యారు. అయితే ఎంజీఆర్‌కు కాస్త అటూఇటూగా స‌మ‌కాలీకుడిగా పేరున్న మ‌రో కోలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు శివాజీ గ‌ణేశ‌న్ కూడా... తానూ రాజ‌కీయాల్లో పొడిచేస్తాన‌ని ఎంట్రీ ఇచ్చారు. అయితే శివాజీ గ‌ణేశన్‌ పై ఏమాత్రం వ్య‌తిరేకత లేకున్నా కూడా... తంబీలు ఎంజీఆర్‌ లా ఆయ‌న‌ను ఆద‌రించ‌లేక‌పోయారు. ఫ‌లితంగా శివాజీ గ‌ణేశ‌న్ రాజ‌కీయాల్లోకి ఎంత వేగంగా వ‌చ్చారో, అంతే వేగంగా బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఇక తెలుగు నాట రాజకీయాల‌ను చూస్తే... ఆంధ్రులంతా అన్న‌గా పిలుచుకునే స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన పెద్ద సంచ‌ల‌న‌మే రేపారు. నాడు కాంగ్రెస్ పార్టీ పాల‌న‌కు వ్య‌తిరేకంగానే ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న‌ను తెలుగు ప్ర‌జ‌లు ఆరాధించారు. అఖండ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు.

త‌మిళ‌నాట ఎంజీఆర్ అయితే.. తెలుగు నాట ఎన్టీఆర్ అన్నారు. ఈ ఇద్ద‌రు కూడా సినిమాల్లో నుంచి వ‌చ్చి రాజ‌కీయాల్లోనూ స‌క్సెస్ సాధించారు. ఇక ఎంజీఆర్ త‌ర్వాత జ‌య‌ల‌లిత కూడా సినిమాల్లో నుంచే వ‌చ్చినా...ఆదిలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా.. ఆ త‌ర్వాత ఎంజీఆర్ కంటే కూడా ఘ‌న‌మైన రాజ‌కీయాల‌నే న‌డిపారు. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన శ‌ర‌త్ కుమార్ గానీ, విజ‌య్ కాంత్ గానీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. ఇక తెలుగు నాట రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి కూడా పెద్ద‌గా రాణించ‌లేదు. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాట ఇప్పుడు రాజకీయాల్లోకి వ‌చ్చిన ర‌జనీకాంత్‌ కు తంబీలు... ఎంజీఆర్‌లా ప‌ట్టం క‌డ‌తారా? శివాజీ గ‌ణేశన్‌ ను తిర‌స్క‌రించిన‌ట్లుగా బ‌య‌ట‌కు వెళ్ల‌గొడ‌తారా? అన్న అంశంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లైపోయింది. అయినా నాడు ఎంజీఆర్ రాజ‌కీయ తెరంగేట్రం నాడు త‌మిళ‌నాట ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితులు ఏమిటి? అదే స‌మ‌యంలో శివాజీ గ‌ణేశ‌న్ ఎంట్రీ ఇచ్చిన స‌మ‌యంలో ఉన్న రాజ‌కీయ స్థితి గ‌తులు ఏమిట‌న్న విష‌యంపై ఇప్పుడు స‌గ‌టు త‌మిళ ఓట‌రు కూడా బేరీజు వేసుకుంటున్న ప‌రిస్థితి. మ‌రి భవిష్య‌త్తులో ర‌జ‌నీకి ఎంజీఆర్‌ కు ద‌క్కిన బంప‌ర్ రికార్డులు ద‌క్కుతాయా? లేదంటే శివాజీ గ‌ణేశ‌న్‌కు ప‌ట్టిన గ‌తి ప‌డుతుందా? అన్న‌ది తేలాలంటే మ‌రి కొద్ది కాలం ఆగక తప్ప‌దేమో.