Begin typing your search above and press return to search.

అందరి చూపు రజనీ వైపే..టెన్షన్ టెన్షన్

By:  Tupaki Desk   |   30 Nov 2020 8:50 AM GMT
అందరి చూపు రజనీ వైపే..టెన్షన్ టెన్షన్
X
ఇంతటి నివర్ తుపాను దెబ్బలో కూడా కనబడని టెన్షన్ తమిళనాడు జనాల్లో సోమవారం పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ రాజకీయ భవిష్యత్తుపై తేలిపోయేది ఈరోజే అంటే సోమవారమే కాబట్టి. రజనీ తరపున కార్యక్రమాలు నిర్వహించే మక్కళ్ళ్ మండ్రం ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి కల్యాణమండపంలో జరగబోయే సమావేశానికి రజనీకాంత్ హాజరవుతున్నారు. ఈ మక్కళ్ మండ్రం జిల్లాల కార్యదర్శులు, రజనీ అభిమాన సంఘాల్లోని కీలక వ్యక్తులతో రజనీ చర్చలు జరుపబోతున్నారు.

రజనీ రాజకీయాల్లోకి వస్తాడని ఒకసారి, లేదు రావటం లేదని మరోసారి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. 2017లోనే తాను రాజకీయాల్లోకి ఎంటర్ అవబోతున్నట్లు రజనీ ప్రకటించారు కాని మళ్ళీ ఇంతవరకు ఎటువంటి కార్యక్రమం చేపట్టలేదు. పైగా ఓ రాజకీయపార్టీ ఏర్పాటు చేయటం ద్వారా యాక్టివ్ పాలిటిక్స్ లోకి దిగుతారని ప్రచారమైతే విపరీతంగా జరుగుతోంది. ఎప్పటికప్పుడు ప్రచారం జరగటమే కానీ ఎటువంటి డెవలప్మెంట్ కనబడటం లేదు.

ఈ నేపధ్యంలోనే రజనీ సమావేశానికి తమిళనాడులో బాగా ప్రాముఖ్యత వచ్చేసింది. ఎందుకంటే వచ్చే ఏడాదే తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇపుడు గనుక రాజకీయ అరంగేట్రంపై ఏదో నిర్ణయం తీసుకోకపోతే తర్వాత తీసుకున్నా జనాలు పెద్దగా పట్టించుకోరు. నిజానికి రజనీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటన్నది ఇప్పటికే ‘నాన్నా పులి’ కథలాగ తయారైపోయింది. ఒకవైపు కమలహాసన్ కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అలాగే డిఎంకే, ఏఐఏడిఎంకేతో పాటు అనేక చిన్నా చితకా పార్టీలు చాలానే ఉన్నాయి.

వీటన్నింటి నడుమ రజనీకాంత్ కొత్తగా పార్టీ పెడితే ఏమవుతుందో ఎవరు చెప్పలేకున్నా రజనీ అంటే ఉన్న క్రేజు కారణంగా ప్రతిసారి చర్చ జరుగుతోంది. సినీస్టార్ గా రజనీ అంటే ఉన్న ఫాలోయింగే వేరు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకున్నా బహుశా ధైర్యంలేకే ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తున్నట్లు అనుమానంగా ఉంది. పైగా రజనీ అనగానే తమిళేతరుడు అనే వాదనను తమిళనాడులోకి కొన్ని సంస్ధలు తెరపైకి తెస్తున్నాయి. ఇటువంటి అనేక కారణాలతో రజనీ సస్పెన్స్ కంటిన్యు చేస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీపై స్పష్టత ఇవ్వటానికి ఇదే చివరి అవకాశం కాబట్టి ఏదో ఒకటి తేల్చేస్తాడని అనుకుంటున్నారు అందరు. చూద్దాం రజనీ ఏమి ప్రకటిస్తారో.