Begin typing your search above and press return to search.

రజనీకాంత్ రాజకీయానికి కొత్త ముహూర్తం!

By:  Tupaki Desk   |   17 Aug 2019 3:55 AM GMT
రజనీకాంత్ రాజకీయానికి కొత్త ముహూర్తం!
X
ఇటీవలే ఒక సినిమాలో కూడా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి సెటైర్ పెట్టారట. ఒక తమిళ సినిమా విషయంలో అది వివాదం అయ్యింది. ఒక వ్యక్తి ఇరవై యేళ్ల పాటు కోమాలో ఉంటాడట. ఇరవై యేళ్ల కిందట ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లే ముందు రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు ప్రసారం అవుతూ ఉంటాయి, అతడు కోమాలో ఇరవై యేళ్లు ఉండి, బయటకు వచ్చాకా కూడా రజనీకాంత్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తుంటాయి!

అలా ఒక సెటైరిక్ సీన్ ను ట్రైలర్లో చూపించారు ఆ సినిమా రూపకర్తలు. అయితే ఈ విషయంలో రజనీకాంత్ అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. తమ అభిమాన హీరోని అలా అవమానిస్తారా? అంటూ రజనీకాంత్ అభిమానులు విరుచుకుపడ్డారు. చివరకు రజనీకాంత్ అభిమానుల నుంచి నిరసన వ్యక్తం అయ్యే సరికి ఆ సీన్ ను తొలగించినట్టుగా ఆ సినిమా మేకర్లు ప్రకటించారు.

ఆ సంగతలా ఉంటే.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి మరో ముహూర్తం తెర మీదకు వచ్చింది. అదే వచ్చే ఏడాది మార్చి. ఇప్పటికే తను రాజకీయాల్లోకి వచ్చినట్టే అని రజనీకాంత్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా వివిధ ప్రకటనలు చేస్తూ ఉన్నారాయన. ఆ ప్రకటనలు అన్నీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉంటూ ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో రజనీకాంత్ భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరించబోతున్నారనే అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని ఖండించే ప్రయత్నం చేయడం లేదు సూపర్ స్టార్. మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో రజనీకాంత్ ఇక రాజకీయంగా యాక్టివ్ అవుతారని, వచ్చే ఏడాది మార్చి నుంచి పొలిటికల్ పార్టీ పనులు ఊపందుకుంటాయని ఆయన అభిమానులు హడావుడి చేస్తూ ఉన్నారు.

అయితే రజనీకాంత్ రాజకీయానికి సంబంధించి ఇలాంటి హడావుడి కొత్తది ఏమీ కాదు. ఆ వ్యవహారం అనునిత్యం చర్చలో ఉంటూనే ఉంది. అయితే రజనీకాంత్ మాత్రం అమీతుమీ తేల్చుకోవడానికి ముందుకు రారు. మరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి దాదాపుగా ఆఖరి గడువు అని పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు!