Begin typing your search above and press return to search.

ఎన్నికల గురించి ఆలోచించటం వదిలేసి.. సీఎం పదవి గురించి ఎందుకు రజనీ?

By:  Tupaki Desk   |   13 Dec 2020 3:30 PM GMT
ఎన్నికల గురించి ఆలోచించటం వదిలేసి.. సీఎం పదవి గురించి ఎందుకు రజనీ?
X
ఏళ్లకు ఏళ్లుగా రాజకీయాల్లో అప్పుడు వస్తారు.. ఇప్పుడు వస్తారంటూ అదే పనిగా వార్తలు వచ్చిన నేత ఎవరైనా ఉన్నారంటే.. అది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే అవుతారు.సుదీర్ఘకాలంగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి నాన్చిన ఆయన.. ఎట్టకేలకు రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. పార్టీ నిర్మాణం.. ఎన్నికల్ని ఎదుర్కోవటం.. ప్రజా సమస్యల మీద అవగాహన తెచ్చుకోవటం.. వాటి పరిష్కార మార్గాల్ని ప్రస్తావించటం మానేసి.. ఏకాఏకిన సీఎం కుర్చీ గురించి మాట్లాడటం ఏమిటో అర్థం కాని పరిస్థితి.

రాజకీయాల్లోకి వచ్చేసినప్పటికి తనకు సీఎం అయ్యే ఉద్దేశం ఏ మాత్రం లేదని స్పష్టం చేయటం చూస్తే..తల పట్టుకోకుండా ఉండలేం. ఒక యువ నాయకుడికి సీఎం పీఠాన్ని కట్టబెట్టాలన్నది తన ఆలోచనగా రజనీ చెబుతున్నారు. దీంతో.. ఆయన అభిమానులు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. తమ నాయకుడి నిర్ణయాన్ని అంగీకరించని వారు.. సీఎం అభ్యర్థి తానే అన్న విషయాన్ని రజనీ చెప్పాలంటూ కోరుతున్నారు. ఇందుకోసం రజనీ అభిమానులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే విషయంలో రజనీ స్పష్టతతో ఉన్నారని.. గట్టి పట్టు మీద ఉన్న ఆయన రాజకీయాల్లోకి రాకముందే సీఎం పదవిని తిరస్కరించారని వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అంశంపై మరోసారి ఆలోచించాలంటూ తలైవాను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆలూ లేదు చూలూ లేదు అన్న సామెత చందంగా.. ముందు ఎన్నికల్లో పోటీ చేసి.. గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వేళలో చెప్పాల్సిన మాటల్ని.. ఇప్పుడే చెప్పటం ఏమిటో..? ఇదేం రాజకీయం బాస్?