Begin typing your search above and press return to search.

యుద్ధం వస్తే కేసీఆర్ కీలకమే..!!

By:  Tupaki Desk   |   29 Sep 2016 11:15 AM GMT
యుద్ధం వస్తే కేసీఆర్ కీలకమే..!!
X
పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన భారత సేనలు రాత్రిరాత్రికి కొట్టిన దెబ్బపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. ఇండియా సత్తా రుచి చూపారంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతర్జాతీయ సమాజమూ మనకే అండగా ఉండడంతో కేంద్రం కను సైగ చేయగానే మన సైనికలు కేవలం 40 నిమిషాల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మూడు కిలోమీటర్ల దూరం చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి.

కాగా కొద్దిరోజులుగా ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మన నిఘా బృందాలు, సైన్యం సరిహద్దుల ఆవల ఏం జరుగుతోందోనని కన్నేసి ఉంచాయి. సరిహద్దుల్లో తీవ్రవాద శిబిరాలను భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించారు. భారత్ పైకి ఉసిగొల్పేందుకు ఐఎస్ఐ, పాక్ ఆర్మీ సన్నాహాలు చేసుకుంటున్నాయని గుర్తించారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారత సైనికులు విరుచుకుపడ్డారు. వివిధ సెక్టార్లలోని 6 నుంచి 8 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పారా కమాండోస్ ను వినియోగించారు. ఆయా ప్రదేశాల్లోకి వీరిని హెలికాప్టర్ల ద్వారా దించారు. మృతుల్లో ఉగ్రవాదులతో పాటు వారికి గైడ్లుగా వ్యవహరించే వారు, శిబిర నిర్వాహకులు కూడా ఉన్నారు.

కాగా మనం యుద్ధానికి సిద్ధమవుతున్నామన్న సంకేతాలివ్వడంతో పాటు దేశంలోని అన్ని రాజకీయ వర్గాలను ఏకం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అంతేకాదు.. సరిహద్దు రాష్ట్రాల సీఎంలకూ సమాచారం అందించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి అన్సారీలకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి పరిస్థితులను వివరించారు. వారితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా మోడీ ఫోన్ చేసి తాజా పరిస్థితులను వివరించారు.

స‌రిహ‌ద్దు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులంద‌రికీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా రాజ్ నాథ్ ఫోన్ చేసి అఖిల‌ప‌క్ష భేటీలో పాల్గొనాల‌ని కోరారు. నియంత్రణ రేఖ వద్ద తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ఆయ‌న కేసీఆర్‌కు చెప్పారు. హైదరాబాద్ లో పలు రక్షణ రంగ సంస్థలు ఉండడం.. పటాలాలు ఉండడం.. వైమానిక స్థావరాలు ఉండడంతో కేసీఆర్ కు పూర్తి సమాచారం అందించి అలర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని రక్షణ రంగ సంస్థలు, వాటి భద్రత - వైమానిక స్థావరాలు వంటివన్నీ ఆయా విభాగాల పర్యవేక్షణలోనే ఉంటున్నప్పటికీ ఇక్కడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సహకారం అవసరం ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర హోం మంత్రి కేసీఆర్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/