Begin typing your search above and press return to search.

మోడీ ఇస్తానంటే బాబు తీసుకోవ‌ట్లేద‌ట‌!

By:  Tupaki Desk   |   16 Oct 2018 6:49 PM GMT
మోడీ ఇస్తానంటే బాబు తీసుకోవ‌ట్లేద‌ట‌!
X
నాలుగేళ్ల పాటు పాలునీళ్ల‌లా క‌లిసిపోయిన బీజేపీ.. టీడీపీ మ‌ధ్య అనుబంధానికి మ‌ధ్య‌లో బీట‌లు వారిన వైనం తెలిసిందే. నాలుగేళ్ల త‌మ ఆశ‌ళ్ని మోడీ పాత‌రేస్తున్నార‌ని.. ప్ర‌త్యేక హోదాను తూట్లు పొడుస్తున్నారంటూ కొత్త ప‌ల్ల‌విని అందుకుంటూ మోడీ ప‌రివారంతో క‌టీఫ్ చెప్పేసిన వైనం తెలిసిందే.

అప్ప‌టి నుంచి బీజేపీ.. టీడీపీల మ‌ధ్య టామ్ అండ్ జెర్రీ వ్య‌వ‌హారం న‌డుస్తోంది. మిత్రుడిగా ఉన్న‌ప్పుడు మోడీని ఒక్క మాట అనేందుకు ఇష్ట‌ప‌డ‌ని చంద్ర‌బాబు.. క‌టీఫ్ చెప్పిన నాటి నుంచి ప్ర‌ధానిపై నిప్పులు చెరుగుతున్న వైనం తెలిసిందే. ఇంత‌కాలం బాబుకు చుక్క‌లు చూపించిన బీజేపీ.. తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

మంగ‌ళ‌గిరిలో బీజేపీ రాష్ట్ర కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేసేందుకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ ను చంద్ర‌బాబు బ‌తికించాల‌ని చూస్తున్న‌ట్లు చెప్పారు. కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకున్న వారు ఎవ‌రూ ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌ప‌డింది లేద‌న్న ఆయ‌న‌.. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం బాబు యూట‌ర్న్ తీసుకున్నార‌న్నారు.

ఇప్ప‌టికీ బీజేపీతో బాబు ఎందుకు క‌టీఫ్ చెప్పారో త‌న‌కు తెలీద‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టం అమ‌లుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని.. ఏపీ అభివృద్ధికి మోడీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికి క‌ట్టుబ‌డి ఉంద‌న్న రాజ్ నాథ్.. రాజ‌ధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చామ‌న్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇస్తున్న‌ట్లు చెప్పిన రాజ్ నాథ్‌.. ఏపీకి ప్ర‌త్యేక‌ప్యాకేజీ మాత్ర‌మే కాదు.. స్పెష‌ల్ ట్రీట్ మెంట్ ఇస్తున్న‌ట్లు చెప్పారు. బెజ‌వాడ అభివృద్దికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చిన‌ట్లు చెప్పిన రాజ్ నాథ్.. ఏపీ కోసం తాము చేసిన‌న్ని ప‌నులు మ‌రెవ‌రూ చేయ‌టం లేద‌న్నారు. తామింత చేసినా.. బాబు మాత్రం ఏమీ చేయ‌లేద‌ని చెబుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏదేదో ఎందుకు ఇవ్వ‌టం. రాజ్ నాథ్ జీ..ఏపీకి ఏకంగా ప్ర‌త్యేక హోదాను ప‌దేళ్లు అధికారికంగా ప్ర‌క‌టించేయొచ్చుగా.?. అప్పుడు అయితే చెప్పుకోవ‌టానికి ఎంతైనా ఉంటుందిగా రాజ్ నాథ్ జీ?