Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ మెరుపు దాడుల‌కు ప్లానింగ్‌?

By:  Tupaki Desk   |   29 Sep 2018 8:23 AM GMT
మ‌ళ్లీ మెరుపు దాడుల‌కు ప్లానింగ్‌?
X
ఎంత ఆగ్ర‌హంలో ఉన్నా.. మ‌రెలాంటి మూడ్‌లో ఉన్నా.. ఆ మొత్తం మూడ్‌ను మార్చేయ‌టంలో కొన్ని భావోద్వేగాలు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. ఒక ప్ర‌భుత్వం మీద ఎంత వ్య‌తిరేక‌త ఉన్నా స‌రే.. అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌జ‌ల్లో ఉన్న కోపం.. ఆగ్ర‌హం చ‌ప్పుల చ‌ల్లారిపోవ‌టానికి ఒక‌ట్రెండు అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకుంటేచాలు.. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న ఆగ్ర‌హం పాల‌పొంగులా త‌గ్గిపోయి.. విప‌రీత‌మైన సానుభూతి వెల్లువెత్తుతుంది.

ఇలాంటి విష‌యాల మీద పెద్ద ఎత్తున అవ‌గాహ‌న ఉన్న బీజేపీ నేత‌లు తాజాగా మ‌రో భారీ స్కెచ్ వేశారా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది. రోజులు గ‌డుస్తున్న కొద్దీ అంత‌కంత‌కూ త‌గ్గుతున్న మోడీ గ్రాఫ్ ను అమాంతం పెంచేందుకు.. యావ‌త్ దేశం భావోద్వేంతో ఊగిపోవ‌టానికి.. జాతీయ భావ‌న‌తో క‌ద‌లిపోవ‌టానికి వీలుగా పాకిస్థాన్ పై మెరుపు దాడులు జ‌రిపేందుకు వీలుగా ప్లాన్ చేస్తుంద‌న్న మాట‌లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తూ.. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఇందుకు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో మ‌న పొరుగున ఉన్న పాకిస్థాన్ అశాంతిని ఎగ‌దోస్తోంద‌ని.. అత్యంత కిరాత‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌న్న రాజ్ నాథ్.. మ‌న బీఎస్ ఎఫ్ జ‌వాన్ల ప‌ట్ల ఎంత క్రూరంగా ప్ర‌వ‌ర్తించిందీ దేశ ప్ర‌జ‌లు చూసిన వైనాన్ని గుర్తు చేశారు.

ఏం జ‌రిగిందో చూశారు.. అది మంచో చెడో తెలుసు.. రాబోయేరోజుల్లో ఏం జ‌ర‌గ‌బోతోందో చూస్తారంటూ చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి పాక్ పై స‌ర్జిక‌ల్ అటాక్స్ కు ప్లాన్ చేస్తున్నారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా ఉన్నాయి. రాజ్ నాథ్ వ్యాఖ్య‌ల‌కు తగ్గ‌ట్లే.. స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కేకే శ‌ర్మ సైతం.. పాక్ పై ప్ర‌తీకారాన్ని తీర్చుకునే టైం కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పారు.

పాక్ పై దాడులు ఏ క్ష‌ణంలో అయినా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. పాక్ లో ఇమ్రాన్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల్లో పాక్ ద‌ళాలు మ‌రింత రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌ని.. మ‌న జ‌వాను న‌రేంద్ర సింగ్ త‌ల న‌రికి చంప‌టాన్ని భార‌త ద‌ళాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. ఇందుకు బ‌దులు తీర్చుకోవాల‌ని వారు ర‌గిలిపోతున్న‌ట్లుగా చెబుతున్నారు.

అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల్లో పాక్ స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం ఇంత పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తించ‌టం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో మన ద‌ళాలు ప్ర‌తీకారం తీర్చుకోవ‌టం కోసం కాచుకొని కూర్చున్నాయ‌ని చెబుతున్నారు. ఓప‌క్క రాజ్ నాథ్‌.. మ‌రోవైపు కేకే శ‌ర్మ‌.. ఇంకోవైపు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ రావ‌త్ సైతం స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ను ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌టం చూస్తుంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి మ‌రో దాడికి ప‌క్కా అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.