Begin typing your search above and press return to search.

సిగ్గు ప‌డ‌కుండా హోదాపై తేల్చేసిన రాజ్ నాథ్‌!

By:  Tupaki Desk   |   25 July 2018 6:30 AM GMT
సిగ్గు ప‌డ‌కుండా హోదాపై తేల్చేసిన రాజ్ నాథ్‌!
X
సుదీర్ఘ‌మైన ప్ర‌సంగాలు వ‌ద్దు.. ఏపీ మీద మీకున్న సానుభూతి ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెట్టండి.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తారా? లేదా? అన్న‌ది ఒకే ఒక్క మాట‌లో చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత క‌మ్ రాజ్య‌స‌భ స‌భ్యుడు గులాం న‌బీ అజాద్ రాజ్య‌స‌భ‌లో సూటిగా అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. నోటితో మాట చెప్ప‌కుండా.. త‌ల‌ను అడ్డంగా ఊపేయ‌టం ద్వారా హోదాకు నో చెప్పేశారు. అంతే కాదు.. రామాయ‌ణం అంతా విని.. అన్న సామెత‌ను త‌న‌దైన శైలిలో ప్ర‌స్తావిస్తూ.. ఇప్ప‌టివ‌ర‌కూ చెప్పిందంతా ఏమిటి? మీకు అర్థం కాలేదా? అంటూ ఎద‌రుప్ర‌శ్న వేశారు.

సో.. ప్ర‌త్యేక హోదా మీద బీజేపీ వారిని అడ‌గాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది మ‌రోసారి తేల్చేశారు. మోడీ చెప్పిన మాట‌లు.. ఇచ్చిన హామీల్ని గాల్లోకి వ‌దిలేశార‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఏపీకి హోదా ఇవ్వ‌కూడ‌ద‌ని తేల్చేశారు. ఇక‌.. బీజేపీతో హోదా గురించి మాట్లాడాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఒక‌వేళ మాట్లాడినా కంఠ‌శోష త‌ప్పించి మ‌రింకేమీ కాదు. మ‌రిప్పుడేం చేయాలి?

ఆంధ్రోళ్ల ముందున్న కింక‌ర్త‌వ్యం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న. మాటిచ్చి.. త‌ప్ప‌ట‌మే కాదు.. మ‌న‌సు నొచ్చుకునేలా చేసిన బీజేపీ వారికి దిమ్మ తిరిగేలా.. మైండ్ బ్లాక్ అయ్యేలా స‌మాధానం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. ఆంధ్రోళ్ల‌కు అన్యాయం చేసినోడు ఎవ‌డూ బాగుప‌డ‌లేద‌న్న విష‌యాన్ని మాట‌ల‌తో చెప్పే క‌న్నా.. చేత‌ల్లో చేసి చూపించాల్సిన అవ‌స‌రం ఉంది. మోడీ ఎంత‌గా మోసం చేస్తారో.. మాటిచ్చి త‌ప్పుతార‌న్న విష‌యాన్ని జాతీయ స్థాయిలో అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెప్ప‌ట‌మే కాదు.. మోడీ కార‌ణంగా ఏపీ ఎంత‌గా మోస‌పోయింద‌న్న విష‌యాన్ని చెప్పాలి.

ఆంధ్రోళ్లు వెనుక‌బ‌డిపోవ‌ట‌మే కాదు.. మోడీ లాంటి వారి తీరు కార‌ణంగా రానున్న రోజుల్లో దేశం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌న్న విష‌యాన్ని మిగిలిన వారికి అర్థ‌మ‌య్యేలా చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇచ్చిన మాట‌ను త‌ప్పిన‌ప్పుడు సిగ్గుప‌డ‌తారు ఎవ‌రైనా. అయితే.. అలాంటి ప‌దార్థాలు త‌మ‌కు ఉండ‌వ‌న్న వైనాన్ని రాజ్ నాథ్ తాజాగా తేల్చేశారు. అంతేకాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హోదా విష‌యంలో మాట మార్చార‌ని.. ఇక హోదా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చేసిన వైనం చూస్తే.. రాజ‌కీయ ల‌బ్థి కోసం బాబు త‌ప్పు చేస్తే.. దాన్ని సాకుగా తీసుకొని ఆంధ్రోళ్ల ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీస్తారా? అన్నది ప్ర‌శ్న‌. బాబు మాట త‌ప్పితే.. అందుకు ఆంధ్రోళ్లు మూల్యం చెల్లించాలా? అన్న‌ది మ‌రో సందేహం. ఐదు కోట్ల‌ మంది బ‌తుకుల్ని ప్ర‌భావితం చేసేలా రాజ్ నాథ్ మాట‌ల నేప‌థ్యంలో.. బీజేపీ వారికి త‌గిన స‌మాధానం చెప్పేలా ఏపీ ప్ర‌జ‌లు వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది. బీజేపీ వారికి మాట‌కు స్పందించ‌కుండా ఉండ‌ట‌మే కాదు.. ఏపీకి చెందిన బీజేపీ నేత‌లు తాము పార్టీలో ఎందుకు ఉన్నామా? అన్న భావ‌న క‌లిగేలా వ్య‌హ‌రించాల్సి ఉంది. ఏపీ బీజేపీ నేత‌ల్ని ఆంధ్రోళ్లు సాంఘిక బ‌హిష్క‌ర‌ణ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. హోదాపై రాజ్ నాథ్ తేల్చేశారు. ఇందుకు బ‌దులు చెప్పాల్సిన బాధ్య‌త ఆంధ్రోళ్ల మీద ఉంది. ఎందుకంటే.. భ‌విష్య‌త్తులో ఎవ‌రూ త‌మ‌తో ఆట‌లాడుకోకూడ‌ద‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పాల్సిందే.