Begin typing your search above and press return to search.

పాక్‌ పై ప్ర‌తీకారం తీర్చుకున్నాం..ఫ్యూచ‌ర్లో తెలుస్తుంది!

By:  Tupaki Desk   |   30 Sep 2018 4:46 AM GMT
పాక్‌ పై ప్ర‌తీకారం తీర్చుకున్నాం..ఫ్యూచ‌ర్లో తెలుస్తుంది!
X
దాయాది పాకిస్తాన్ పై మెరుపు దాడులు నిర్వ‌హించాల‌న్న‌ట్లుగా భార‌త స‌ర్కారు సిద్ధ‌మ‌వుతున్న వైనంపై వ‌చ్చిన వార్త‌లు నూటికి నూరు శాతం నిజ‌మ‌ని తేలింది. ఆ విష‌యాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. భార‌త బీఎస్ఎఫ్ జ‌వానును అత్యంత దారుణంగా గొంతు కోసి చంపినందుకు భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది.

స‌రిహ‌ద్దుల‌కు అవ‌త‌ల ఉన్న పాక్ స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని శ‌త‌ఘ్నుల‌తో విరుచుకుప‌డింది. జ‌వాన్లు కురిపించిన గుళ్ల వర్షంలో శ‌త్రు ద‌శాలు క‌కావిక‌లం కావ‌ట‌మే కాదు.. భారీగా ప్రాణ‌న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా తెలుస్తోంది. రాజ్ నాథ్ సింగ్ మాట‌ల్లో చెప్పాలంటే.." ప్ర‌తీకార ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. అదేమిట‌న్న‌ది వెల్ల‌డించ‌ను.. రెండు.. మూడు రోజుల క్రితం భారీ ఘ‌ట‌న జ‌రిగింది. న‌న్ను న‌మ్మండి.. జ‌రిగిందేమిటో భ‌విష్య‌త్తులో మీకు తెలుస్తుంది" అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో.. పాక్ పై భార‌త్ మ‌రోసారి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ను చేప‌ట్టిన వైనం ఖ‌రారైన‌ట్లైంది.

ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. మెరుపుదాడుల గురించి రాజ్ నాథ్ వెల్ల‌డించినా.. దాని తీవ్ర‌త‌ను మాట‌ల్లో చూచాయ‌గా చెప్పారే కానీ.. ఆ వివ‌రాల్ని పూర్తిగా మాత్రం చెప్ప‌లేదు. అయితే.. రాజ్ నాథ్ చెప్పిన మాట‌ల తీవ్ర‌త‌ను చూస్తే.. పాక్ బ‌ల‌గాల‌కు భారీ స్థాయిలో న‌ష్టం వాటిల్లింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

పాక్ పొరుగు దేశం కావ‌టంతో తొలి తూటా మ‌నం పేల్చ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని బీఎస్ ఎఫ్ జ‌వాన్ల‌కు సూచించాన‌ని.. ఒక‌వేళ స‌రిహ‌ద్దుల వెంట కాల్పులు మొద‌లైతే.. ఎన్ని తూటాలు పేలుస్తామ‌న్న‌ది ప‌ట్టించుకోకుండా ధీటుగా స‌మాధానం చెప్పాల‌ని తాను స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

గ‌తంలో జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ను గుర్తు చేసిన రాజ్ నాథ్‌.. ఆక్ర‌మిత క‌శ్మీర్ పై 2016లో జ‌రిగిన వైనాన్ని చెబుతూ.. నాడు ప్ర‌ధాని మోడీ గ‌ట్టి సంక‌ల్పాన్ని ప్ర‌ద‌ర్శించి దాడులు చేయ‌టానికి మ‌న సైన్యానికి అనుమ‌తిచ్చిన రోజు త‌న‌కింకా గుర్తుంద‌ని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ సంద‌ర్భంగా పాక్ భూభాగంలోకి వెళ్లిన మ‌న క‌మాండోలు పాక్ ను చావుదెబ్బ తీశార‌ని.. మ‌న క‌మాండ్లో ఒక‌రికి మాత్ర‌మే గాయాలు అయిన‌ట్లు చెప్పారు. ఇక‌.. చైనాతో ఉన్న స‌రిహ‌ద్దు వెంట ఉన్న ఉద్రిక్త‌త‌ల గురించి మాట్లాడుతూ.. నేడు రెండు దేశాల మ‌ధ్య తోపులాటలకే ప‌రిమితం అవుతోంది. ఒక‌ప్పుడు అదే దేశం మ‌న‌పై దాడి చేసిందని.. ఈ రోజు తోపులాట‌ల‌కే ప‌రిమితం కావ‌టం చూస్తే భార‌త్ బ‌లాన్ని చైనా గుర్తించింద‌ని చెప్పారు. గ‌తంలో మాదిరి భార‌త్ బ‌ల‌హీన దేశం కాద‌న్న వైనాన్ని గుర్తించే చైనా ఆచితూచి అన్న‌ట్లుగా ఉంద‌న్నారు.