Begin typing your search above and press return to search.

ఏపీకి తీపి...తెలంగాణ‌కు చేదు....

By:  Tupaki Desk   |   27 Sep 2018 2:46 PM GMT
ఏపీకి తీపి...తెలంగాణ‌కు చేదు....
X
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత శాసనసభ సీట్ల పెంపుపై కేంద్ర హోం శాఖ ఆలోచనలో పడుతున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన ప్రకారం ఏపీ - తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచాలని అనుకున్నారు. అయితే గత నాలుగేళ్లుగా ఈ అంశంపై స్థబ్దుగా ఉన్న కేంద్ర హోం శాఖ - ఈ అంశాన్ని వెంటనే పునప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ జనాభా లెక్కల అధికారులతోను - కేంద్ర ఎన్నికల సంఘంతోను చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ముందుగా ఎస్సీ - ఎస్టీ నియోజకవర్గాలను గుర్తించేందుకు ఎలక్షన్ కమీషన్‌ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఏ జనాభా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గాలను విడదీయాలా అని అధికారులు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. 2001 జనాభా లెక్కల ప్రకారం శాసనసభ సీట్లు సర్దుబాటు చేయాలని రిజిస్ట్రార్ జనరల్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎస్సీ - ఎస్టీ రిజర్వుడు సీట్లు మాత్రం 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించిందని అంటున్నారు. అయితే సాధారణ సీట్లకు 2001 గణన తీసుకుని - రిజర్వుడు సీట్లకు 2011 గణన తీసుకుంటే వివాదానికి దారి తీయవచ్చునని - న్యాయపరమైన అంశాలు కూడా తలెత్తవచ్చునని అంటున్నారు. ఒక వేళ ఈ అంశంపై సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలన్న అంశంపై హోం శాఖ తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

ఈ అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపుపై రాజ్యాంగంలో 170 ఆర్టికల్ ‌ను సవరించాలని ప్రభుత్వానికి అటార్నీ జనరల్ ఒక నివేదిక అందించింది. ఆ నివేదికను పరిగణలోకి తీసుకుని ముందుకు పోవాలని హోం శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను పార్లమెంటు ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 సీట్లు 225 కి - తెలంగాణలో ఉన్న 119 సీట్లు 153 కి పెరుగుతాయి. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లు ఇద్దరూ సీట్ల పెంపుపై ప్రధాని మోదీని - హోం మంత్రి రాజ్‌ నాథ్‌ ను కలసి వినతిపత్రాలను ఇచ్చారు. సీట్ల పెంపునకు కేంద్ర హోం శాఖ అంగీకరించడంతో ఈ ప్రక్రియను వేగంవంతం చేసింది. తెలంగాణలో ఎన్నికల కోయిల ముందే కూయడంతో ఈ అంశం 2023 వరకూ తేలే అవకాశం ఉండదని వారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో నవంబర్ లేక డిశంబరులో జరిగే శీతాకాల సమావేశాలలో చట్టాన్ని సవరిస్తామని హోంశాఖ చెబుతోంది. చట్ట సవరణ లేదా రాజ్యంగ సవరణకు సంబంధించి పార్లమెంటు శీతకాల సమావేశాలలో బిల్లు ఆమోదింప చేస్తామని, అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలలకు 3 లేక 4 నెలల గడువు ఉంటుందని - నియోజకవర్గాల విభజనకు ఆ సమయం సరిపోతుందని హోం శాఖ వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫీకేషన్ విడుదల చేస్తారని అంటున్నారు. తెలంగాణలో మాత్రం 2023లోనే శాసనసభ సీట్లు పెంపు జరుగుతుందని హోంశాఖ అన్నట్లు సమాచారం.