Begin typing your search above and press return to search.

కలలో కూడా ఊహించలేని అంశాన్ని ఇవాళే తీసుకొచ్చారే?

By:  Tupaki Desk   |   9 Nov 2019 2:59 PM GMT
కలలో కూడా ఊహించలేని అంశాన్ని ఇవాళే తీసుకొచ్చారే?
X
ఏళ్లకు ఏళ్లుగా భారతరాజకీయాల్లోని ఆట నియమాల్ని మోడీ పరివారం మార్చేస్తుందా? అంటే అవునని చెప్పాలి. సుదీర్ఘ కాలంగా నానుతున్న ఒక అంశం లెక్క ఒక కొలిక్కి వచ్చినట్లుగా భావిస్తున్న వేళ.. అక్కడితో ఆగి.. కొంతకాలం తర్వాత మరో అంశాన్ని టేకప్ చేయటం మామూలుగా జరిగేది. కానీ.. మోడీ సర్కారు అందుకు భిన్నం. ఒకటి పూర్తైన వెంటనే.. మరొకటి ప్రాధాన్యత కిందకు తీసుకొచ్చేయటం కమలనాథులకే చెల్లింది.

134 ఏళ్లుగా నలుగుతున్న అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన పరిణామాలు.. స్పందనలు ఎలా ఉంటాయన్న విషయాన్ని పట్టించుకోకుండా.. తమ తర్వాత టేకప్ అంశం ఏమిటన్న విషయాన్ని చెప్పేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాజ్ నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కామన్ సివిల్ కోడ్ అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. ఆ టైమొచ్చిందన్న మాట రాజ్ నాథ్ నోటి నుంచి వచ్చింది.

దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలంటూ పలు పిటిషన్లు ఢిల్లీ హైకోర్టు వచ్చే సోమవారం నుంచి ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. దేశంలో జాతి.. కుల.. మత.. వర్గ.. లింగ భేదం లేకుండా పౌరులందరికి ఒకే చట్ట పరిధిలోకి తీసుకొచ్చే ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించిన అంశంపై కొన్నేళ్లుగా చర్చలు సాగుతున్నాయి. దీనిపై బీజేపీ మొదట్నించి సానుకూలంగా ఉంది.

దీనికి కొన్ని వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ అంశమే తమ తర్వాతి ఎజెండా అన్న విషయాన్ని రాజ్ నాథ్ తాజా వ్యాఖ్యలు స్పష్టం చేశాయని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి పౌరస్మృతి గురించి ప్రస్తావించటానికి తటపటాయించే తీరుకు భిన్నంగా ఆ టైమొచ్చిందన్న మాట వచ్చిందంటే.. తమ ఎజెండాను పూర్తి చేసే విషయంలో కమలనాథులు ఎంత కచ్ఛితంగా ఉన్నారన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.