Begin typing your search above and press return to search.

సైనికుడి కష్టం రాజ్ నాథ్ దృష్టికి వెళ్లింది

By:  Tupaki Desk   |   10 Jan 2017 5:46 AM GMT
సైనికుడి కష్టం రాజ్ నాథ్ దృష్టికి వెళ్లింది
X
ప్రాణాల్ని పణంగా పెట్టి విధులు నిర్వర్తించే సైనికుడి జీవితం ఎంత దారుణంగా ఉందన్న విషయాన్నిప్రపంచం మొత్తానికి చూపించిన బీఎస్ఎప్ జవాను తేజ్ బహుదూర్ ప్రయత్నం ఫలించినట్లే. అవినీతి కారణంగా సరిహద్దు దగ్గర విధులు నిర్వర్తించే సైనికులకు అందిస్తున్న నాసిరకం ఆహారంపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. సైనికుల దీనగాథను వీడియోగా చేసి ఫేస్ బుక్ లో పెట్టిన తేజ్ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆయన పోస్ట్ చేసిన వీడియోకు మీడియాలో ప్రాధాన్యత లభించటం.. టీవీ ఛానళ్లు పెద్ద ఎత్తున దీన్ని వార్తాంశంగా మార్చటంతో గంటల వ్యవధిలోనే ఈ విషయం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ దృష్టికి వెళ్లింది. సైనికుల కోసం కేంద్రం ఎన్నో సదుపాయాలు కల్పించినా.. పందిక్కొకుల్లాంటి అవినీతి అధికారుల పుణ్యమా అని.. తినటానికి సరై తిండి కూడా తమకు లభించటం లేదంటూ సైనికుడు తేజ్ వాదనకు పెద్ద ఎత్తున సానుకూలత లభించటంతో పాటు.. అవినీతి అధికారులపై వేటు వేయాలన్న డిమాండ్ పెరిగింది.

ఈ వీడియో గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారమవుతున్న విషయాన్ని గుర్తించిన రాజ్ నాథ్.. సదరు వీడియోను తనకు చూపించాలని కోరటమేకాదు.. ఇందుకు బాధ్యులైన అవినీతి అధికారులపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు జారీ చేశారు. తాను తీసిన వీడియోకు సీనియర్ అధికారులు తనపై వేటువేసే అవకాశం ఉందన్న వాదనను వినిపించిన తేజ్ బహదూర్ కు పూర్తి స్థాయి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆయన ఉద్యోగభద్రతపై ప్రధాని స్పందిస్తే మరింత బాగుండటమే కాదు.. సైనికుల కష్టాలు తీరిపోతాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/