Begin typing your search above and press return to search.

హోం మంత్రి అయితే చెంపదెబ్బలు కొట్టేస్తారా?

By:  Tupaki Desk   |   10 Jun 2016 9:11 AM GMT
హోం మంత్రి అయితే చెంపదెబ్బలు కొట్టేస్తారా?
X
కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ఓ సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్ ల‌క్నోలోని మౌ వద్ద నిర్వహించిన ఓ సభలో కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు దురుసుగా ప్రవర్తిస్తూ అల్లరి చేశారు. దీంతో తొలుత ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక‌రు మాట్లాడే స‌మ‌యంలో మ‌ధ్య‌లో క‌ల‌గ‌జేసుకోవ‌ద్ద‌ని రాజ్‌ నాథ్ వారికి సూచించారు. అప్పటికీ వారు ఆగకుండా గొడవ చేస్తుండడంతో నిశ్శ‌బ్దాన్ని పాటించ‌క‌పోతే చెందెబ్బ‌లు ప‌డ‌తాయ‌ని వ్యాఖ్యానించారు. మొద‌ట కేక‌లు వేయొద్దంటూ రాజ్‌ నాథ్ సింగ్ సున్నితంగా హెచ్చరించారు. అయినప్ప‌టికీ ఓ గ్రూపు అదేప‌నిగా కేక‌లు వేయ‌డంతో రాజ్‌ నాథ్ సింగ్ పట్టరాని కోపంతో ఊగిపోయారు. కామ్ గా ఉండకపోతే చెంప‌లు ప‌గులుతాయ్ అని గ‌ట్టిగా హెచ్చ‌రించారు. అయితే.. రాజ్ నాథ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన కేంద్ర హోం మంత్రి పదవిలో ఉన్న ఆయన అలా చెంపదెబ్బలు తగులుతాయ్ అంటూ ఘర్షణ పూర్వక వ్యాఖ్యలు చేయడంపై విమర్శలొస్తున్నాయి.

అయితే... సభలో గొడవ చేసింది సమాజ్ వాది పార్టీ కార్యకర్తలని.. వారు కావాలనే అల్లరి చేస్తున్నారని తెలియడంతోనే రాజ్ నాథ్ వారిని కంట్రోల్ చేయడానికి అలా వ్యాఖ్యానించారని అంటున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌ లో చెల‌రేగుతోన్న ప‌లు ఆందోళ‌న‌లు - ఇటీవ‌లి మ‌ధుర వంటి ఘ‌ట‌న‌ల‌పై ఆయ‌న ఉత్త‌రప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. భూముల‌న్నీ క‌బ్జాల‌యిపోతున్నాయ‌ని, వాటిపై రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద వివ‌రాలు కూడా లేవ‌ని రాజ్‌ నాథ్ సింగ్ ఆ సభలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సమయంలో ఈ గొడవ జరిగింది. దీంతో రాజ్‌ నాథ్ సింగ్ వారిని నియంత్రించేందుకే అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని భాజపా వర్గాలు చెబుతున్నాయి.

కాగా.. కేంద్ర హోం మంత్రయినా కూడా.. దేశ శాంతిభద్రతల వ్యవస్థకు బాస్ అయినా కూడా అలా చెంపదెబ్బలు కొడితే అది నేరమే అవుతుంది. ఎలాంటి కేసుల్లో అయినా, నేరాల్లో అయినా చట్టప్రకారం విచారణ అనంతరం మాత్రం సంబంధిత అధికారులకు మాత్రమే చర్యలు తీసుకునే అధికారాలుంటాయి. కానీ.. రాజనాథ్ అదంతా మరిచి ఇలా చెంపదెబ్బలు కొడతాననడం వివాదంగా మారింది.