Begin typing your search above and press return to search.

రజినీకాంత్ తమిళంలో ఏం ప్రకటన చేశారో తెలుసా?

By:  Tupaki Desk   |   30 Dec 2020 2:38 PM GMT
రజినీకాంత్ తమిళంలో ఏం ప్రకటన చేశారో తెలుసా?
X
రాజకీయాల్లోకి రావడం లేదన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటన నిన్న యావత్ భారతదేశంలో సంచలనమైంది. ఆయన వస్తాడు.. తమిళనాడు సీఎం అవుతాడని అందరూ భావించగా అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ అనారోగ్యాన్ని కారణంగా చూపి రాజకీయాల కాడి వదిలేశారు. ఈ మంగళవారం మూడు పేజీల బహిరంగ ప్రకటనను రజినీకాంత్ విడుదల చేశారు. తమిళంలో రాసిన ఈ లేఖలో అసలు ఏముందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

మొదటగా రజినీకాంత్ తమినాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను ప్రారంభించారు. నాకు జీవితాన్ని ప్రసాదిస్తున్న దైవసమానులైన తమిళ ప్రజలకు నా కృతజ్ఞతలు అంటూ మొదలు పెట్టారు.

జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించి, వైద్యుల సూచనలను సైతం కాలదన్ని ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వెళ్లానని.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నలుగురికి కరోనా వచ్చిందని.. దీంతో షూటింగ్ నిలిపివేశామన్నారు. నాతో పాటు అందరికీ కరోనా పరీక్షలు చేయించామన్నారు. నాకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని రజినీకాంత్ లేఖలో పేర్కొన్నారు.

కానీ రక్తపోటు అధికమైందని.. ఇప్పటికే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని వున్నందున రక్తపోటు హెచ్చుతగ్గులుగా ఉండకూడదని వైద్యులు హెచ్చరించారన్నారు. వారి సూచన మేరకు ఆస్పత్రిలోనే మూడు రోజులు ఉన్నానని తెలిపారు.

నా ఆరోగ్య పరిస్థితిని చూసి ప్రొడ్యూసర్‌ కళానిధిమారన్‌ షూటింగ్‌ వాయిదా వేయడంతో అనేకమందికి జీవనోపాధి పోయిందని రజినీకాంత్ వాపోయారు.. కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. వీటన్నింటికీ కారణం నా ఆరోగ్య పరిస్థితే. ఇది దేవుడు నాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నానని రజినీ లేఖలో తెలిపారు.

నేను పార్టీ ప్రకటించాక.. జనంలోకి వెళ్లాల్సి వస్తుందని.. ఇప్పటికే రోగ నిరోధక శక్తి పెంచే మాత్రలను తీసుకుంటున్నాను. అలాంటప్పుడు ప్రజలను నేరుగా కలుసుకుని ప్రచారం చేస్తే నాకూ, దాని వల్ల ప్రజలకు వైరస్‌ వ్యాపించే ప్రమాదం వుందని రజినీకాంత్ తెలిపారు. నాతో పాటు రాజకీయ ప్రయాణం చేసే వారికి కూడా పలు ఇబ్బందులు, సమస్యలు తెచ్చినట్టే అవుతుందన్నారు. వారు మానసికంగా, శారీరకం గానూ, ఆర్థికంగానూ సమస్యలు ఎదుర్కొవాల్సి వుంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదని భావిస్తున్నానన్నారు.. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను ఇచ్చిన మాటను మాత్రం తప్పనంటూ పార్టీ ప్రకటనను మానుకున్నానని వివరించారు.

రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజలకు ఏం చేయగలనో ఆ మేరకు సేవ చేస్తానని.. నేను నిజాలు మాట్లాడేందుకు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని రజినీకాంత్ పేర్కొన్నారు. నా ఆరోగ్యంపై శ్రద్ధ వున్న వారు, నన్ను బ్రతికించే నా దేవుళ్లయిన నా అభిమానులు, తమిళనాడు ప్రజలు ఈ నిర్ణయాన్ని ఆమోదించాలని అభ్యర్థిస్తున్నా’ అని రజనీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


https://twitter.com/rajinikanth/status/1343803830429863937?s=20