Begin typing your search above and press return to search.

పెద్దల సభ నిరవధికంగా వాయిదా వేసేశారు

By:  Tupaki Desk   |   16 Dec 2016 8:12 AM GMT
పెద్దల సభ నిరవధికంగా వాయిదా వేసేశారు
X
దాదాపు నెల రోజుల పాటు (పని దినాల లెక్క వేరే) సాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సంబంధించి ఒక అంకం ముగిసింది. రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తూ.. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు. గత నెల 16న శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెద్దనోట్లను రద్దు చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయంపై పెద్దల సభ అట్టుడికిపోయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విపక్షాలుపెద్ద ఎత్తున నిరసనలు చేపట్టటం.. ఆందోళనలు నిర్వహించటం.. సభ కార్యకలాపాల్ని అడ్డుకోవటంతో సభ సాగలేదు.

దాదాపు పది కీలకమైన బిల్లుల ఈ సమావేశాల్లో ఆమోదం పొందుతాయని భావించినప్పటికీ.. అలాంటిది జరగకపోగా.. రెండు బిల్లులు మాత్రమే ఆమోద ముద్ర పడ్డాయి. ప్రధాని మోడీ రాజ్యసభకు వచ్చి పెద్దనోట్ల రద్దు అంశంపై జరిగే చర్చలో పాల్గొనాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. సమావేశాల సందర్భంగా ప్రధాని హాజరైనప్పటికీ.. గొడవ మాత్రం సద్దుమణలేదు. అదే సమయంలో.. నోట్ల రద్దు అంశంపై చర్చకుతాము సిద్దమంటూ మోడీ సర్కారు స్పష్టం చేసినప్పటికి ఈ విషయంపై చర్చమాత్రం సాగలేదు.

మొత్తంగా.. నువ్వానేనా అన్న ధోరణిలో అధికార.. విపక్షాల మధ్య సాగిన అధిపత్య ధోరణి పుణ్యమా అని విలువైన సభా సమయం కరిగిపోయిందని చెప్పాలి. నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన పెద్దల సభలో.. అధికార..విపక్షాల ఆవేశకావేశాలతో ఎలాంటి చర్చ జరగని దుస్థితి. మొత్తంగా చూస్తే.. స్వార్థ రాజకీయం పుణ్యమా అని ప్రజలకు మేలు చేకూర్చే అంశాల మీద చర్చ జరగాల్సిన సభలో.. అలాంటిదేమీ జరగకుండానే శీతాకాల సమావేశాలు ముగిసి.. సభ నిరవధికంగా వాయిదా పడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/