Begin typing your search above and press return to search.

కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. వివరాలివే!

By:  Tupaki Desk   |   17 March 2021 1:30 AM GMT
కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. వివరాలివే!
X
కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. బాధిత మహిళలకు ఊరట కలిగించే ఈ బిల్లు తాజా ఆమోదంతో త్వరలో చట్టంగా మారనుంది. ప్రత్యేక సందర్భాల్లో మహిళలు అబార్షన్ చేయించుకోవటానికి సంబంధించిన అంశంపై కొత్త విధానాలు ఈ బిల్లుతో రానున్నాయి. ఇప్పటివరకు దేశంలో గర్భస్రావం చేసుకోవాలంటే 20 వారాల లోపే చేయించుకోవాల్సి ఉంటుంది. తాజాగా వస్తున్న చట్టం ప్రకారం 24 వారాలకు గడువు పెంచారు.

అత్యాచార బాధితులు.. వావివరుస లేని లైంగిక సంబందాల బాధితులు.. మైనర్లు.. దివ్యాంగులతో సమా ప్రత్యేక వర్గాలకు చెందిన మహిళలు అబార్షన్ చేయించుకోవాలంటే ఇప్పుడున్న పరిమితికి మించి ఇవ్వనున్నారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971ను సవరిస్తూ.. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్ మెంట్ బిల్లు 2020ను మూజువాణి ఓటుతో ఆమోదించారు. వాస్తవానికి ఈ బిల్లును ఏడాది క్రితమే లోక్ సభ ఆమోదించింది. అయితే.. విపక్షాలు ఈ బిల్లుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిని సెలెక్టు కమిటీకి పంపాలన్న డిమాండ్ కూడా వచ్చింది.

అయితే.. ఆ అవసరం లేదని రాజ్యసభ తోసిపుచ్చింది. ఈ బిల్లు మహిళలకు వ్యతిరేకం ఎంత మాత్రం కాదని మోడీ సర్కారు చెబుతోంది. మహిళలకు వ్యతిరేకంగా ఏ చట్టాన్ని రూపొందించే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెబుతున్నారు. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల్ని అధ్యయనం చేసి.. మన దేశంలో పెద్ద ఎత్తున చర్చలు జరిపిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతుున్నారు. ఈ బిల్లును ఆమోదించినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. అయితే.. ఈ బిల్లులోని సదుపాయాల్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణ ఉంది.