Begin typing your search above and press return to search.

ఏపీ నుంచి రాజ్యసభకు వీళ్లేనా..!

By:  Tupaki Desk   |   20 Feb 2020 2:30 PM GMT
ఏపీ నుంచి రాజ్యసభకు వీళ్లేనా..!
X
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు నాలుగు ఖాళీ కానున్నాయి. వీటిని ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం. కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులు.. కుటుంబసభ్యులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. ఆ వార్త ప్రకారం..

రాజ్యసభకు తన సోదరి షర్మిల - ఆది నుంచి జగన్ వెంట ఉంటున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది. ఈ ఎంపికలో జగన్ ముద్ర కనిపిస్తోంది. ఎందుకంటే ఈ జాబితా పరిశీలిస్తే మొదటి నుంచి జగన్ వెంట అండదండగా నిలబడిన వారే ఉన్నారు. ఒక్క రఘువీరారెడ్డి మినహా మిగతా వారు వైఎస్ జగన్ కు వ్యక్తిగతంగా ఎంతో దగ్గరి వారు. ఆది నుంచి ఆయన వెంట నడిచిన వారే. షర్మిల సోదరి కావడం.. ఆపద సమయంలో ఆమె అన్నకు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు.

తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది.

ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట.

అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ ను అభిమానించే వ్యక్తి. రాయలసీమ ప్రాంతంలో కీలకమైన అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డి ఇప్పటికీ తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని వదలేదు. మొన్నటి వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు. తన తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా రఘువీరారెడ్డికి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే రఘువీరారెడ్డి మృదుస్వభావి కావడంతో వీరు ఇచ్చే ఆఫర్ ను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. అందుకే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట. కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

ఈ విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించే జాబితా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఎవరెవరు రాజ్యసభకు వెళ్తారు? వారి ఎంపికలో ఎలాంటి సమీకరణాలు ఆలోచించారో త్వరలోనే తెలియనుంది.