Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఎవ‌రికెన్ని సీట్లు వ‌చ్చాయ్‌?

By:  Tupaki Desk   |   24 March 2018 5:18 AM GMT
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఎవ‌రికెన్ని సీట్లు వ‌చ్చాయ్‌?
X
రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ముగిశాయి. మొత్తం 59 స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. ఒక్క స్థానం త‌ప్ప‌.. మిగిలినదంతా అనుకున్న‌ది అనుకున్న‌ట్లే జ‌రిగింది. మొత్తం 13 పార్టీల అభ్య‌ర్థులు తాజాగా పెద్ద‌ల స‌భ‌కు వెళ్ల‌నున్నారు. తాజా ఎన్నిక‌ల్లో అత్య‌ధికంగా ప్ర‌యోజ‌నం చేకూరిన పార్టీల విష‌యానికి వ‌స్తే.. అధికార బీజేపీ భారీగా లాభ‌ప‌డింది. ఆ పార్టీ త‌ర‌ఫున తాజాగా 28 మంది పెద్ద‌ల స‌భ‌లోకి అడుగుపెట్ట‌నున్నారు.

మొత్తం 16 మంది ఎలాంటి పోటీ లేకుండా పెద్ద‌ల స‌భ‌లోకి అడుగుపెట్టే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంటే.. మ‌రో 12 మంది మాత్రం పోటీ ప‌డి మ‌రీ విజ‌యం సాధించారు. ఈ ప‌న్నెండు మందిలో ఒక స్థానంలో బ‌లం లేకున్నా.. అమిత్ షా తిప్పిన చ‌క్రం పుణ్య‌మా అని ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. బీజేపీ త‌ర్వాత భారీగా రాజ్య‌స‌భ‌కు పెద్ద‌మ‌నుషుల్ని పంపుతున్న పార్టీగా కాంగ్రెస్ ను చెప్పాలి. మొత్తం 10 మంది తాజాగా రాజ్య‌స‌భ‌లోకి అడుగు పెట్ట‌నున్నారు.

వీరిలో ఐదుగురు పోటీ లేకుండా ఏక‌గ్రీవం కాగా.. మ‌రో ఐదుగురు మాత్రం పోటీ ప‌డి మ‌రీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ త‌ర్వాత ఎక్కువ సీట్ల‌ను త‌మ ఖాతాలో వేసుకున్న పార్టీగా మ‌మ‌త నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ నిలిచింది. మొత్తం నాలుగు సీట్లు పోటీ ప‌డి మ‌రీ సొంతం చేసుకుంది.

ఇక‌.. మిగిలిన పార్టీల విష‌యానికి వ‌స్తే.. టీఆర్ఎస్ మూడు స్థానాల్ని పోటీ ప‌డి సొంతం చేసుకోగా.. టీడీపీ ఏక‌గ్రీవంగా ఇద్ద‌రిని పెద్ద‌ల స‌భ‌కు పంపింది. ఆర్జేడీ.. జేడీయూలు ఇద్ద‌రు చొప్పున ఏక‌గ్రీవం చేసుకోగా.. అదే బాట‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌.. ఎన్ సీపీ.. శివ‌సేన లు సైతం ఒక్కొక్క స్థానంలో ఏక‌గ్రీవం చేసుకున్నారు. ఇక‌.. ఎస్పీ..లెఫ్ట్ పార్టీలు మాత్రం ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి.. పోలింగ్ ప‌రీక్ష‌ను ఎదుర్కొని త‌మ స‌త్తాను చాటి పెద్ద‌ల స‌భ‌కు ఒక్కొక్క‌రు చొప్పున పంపుతున్నారు.