Begin typing your search above and press return to search.

సార్వ‌త్రిక స‌మ‌రంలా రాజ్య‌స‌భ ఎన్నిక‌లు.. కాంగ్రెస్‌-బీజేపీ ఢీ అంటే ఢీ

By:  Tupaki Desk   |   11 Jun 2022 3:21 AM GMT
సార్వ‌త్రిక స‌మ‌రంలా రాజ్య‌స‌భ ఎన్నిక‌లు.. కాంగ్రెస్‌-బీజేపీ ఢీ అంటే ఢీ
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల‌పాటు స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌లు మాత్రం సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను మించిన రీతిలో జ‌రిగాయి. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ హోరాహోరీగా జ‌రిగింది. అయితే, కర్ణాటక, రాజస్థాన్లో మాత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడగా.. బీజేపీ ఫిర్యాదుతో హరియాణా, మహారాష్ట్రలో ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు నిలిపేసింది.

కర్ణాటకలో.. కర్ణాటకలో నాలుగు స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగగా.. మూడు స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ నటుడు, రాజకీయ నేత జగ్గేశ్, మాజీ ఎంఎల్సీ లెహర్ సింగ్ సిరోయాలు గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాజస్థాన్లో.. రాజస్థాన్లో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగగా.. మూటింట అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.

కాంగ్రెస్ అభ్యర్థులు రణ్దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీలు ఎన్నికైనట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్వీట్ చేశారు. బీజేపీ తరఫున బరిలో దిగిన మాజీ మంత్రి ఘనశ్యామ్ తివారీ విజయం సాధించారు.

4 రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జ‌రిగింది. ఓటింగ్ పూర్తయిన గంట అనంతరం.. ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవల మొత్తం 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి.

జూన్‌- ఆగస్టు మధ్య వివిధ తేదీల్లో 57 మంది ఎంపీల పదవీకాలాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలున్నాయి.

రెండు అధికార పార్టీలకు భారీ మెజారిటీ ఉండడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు కీల‌కంగా మారాయి. అలాగే, ఇటీవలే పెద్దల సభలో 100 మార్కు చేరుకున్న బీజేపీ కూడా అంతే తీవ్రంగా పోరాడుతోంది.