Begin typing your search above and press return to search.

వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు !

By:  Tupaki Desk   |   17 July 2020 11:41 AM GMT
వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు !
X
ఆంధప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో సహా దేశంలోని 61 మంది వేర్వేరు పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ..కొత్తగా రాజ్యసభకి ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారాన్నిచేయించబోతున్నారు. జులై 22వ తేదీన రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సమాచారం. పార్లమెంట్ హౌస్ ఛాంబర్ ‌లో రాజ్యసభ సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

సాధారణంగా అయితే, రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకారం .. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఉంటుంది. అయితే , ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో . వ్యాధి తీవ్రతని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ హౌస్ ఛాంబర్ ‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి 61 మంది సభ్యులు రాజ్యసభ కు ఎన్నికైయ్యారు. అలాగే , ప్రమాణ స్వీకారం చేయదలిచిన ప్రతి సభ్యుడు కూడా తమ వెంట ఒకరిని మాత్రమే వెంట తెచ్చుకోవాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా దృష్ట్యా ఒకరిని తప్ప ఎక్కువమందికి అవకాశం లేదు అని తెలిపింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజ్యసభ, లోక్‌సభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుందని సమాచారం.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నుండి నలుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, సీనియర్ నేత అయోధ్యా రామిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీ వైసీపీ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. గత 19 న జరిగిన ఎన్నికల్లో ఈ నలుగురు రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందారు.