Begin typing your search above and press return to search.

చరిత్ర సృష్టించిన రాజ్యసభ

By:  Tupaki Desk   |   2 Jan 2018 12:43 PM GMT
చరిత్ర సృష్టించిన రాజ్యసభ
X

పెద్ద‌ల స‌భ‌గా పేరున్న రాజ్యసభకు మంచి రోజులు వచ్చాయేమో !!. ఎటువంటి ఆటంకాలు లేకుండానే ఇవాళ రాజ్యసభలో సమావేశాలు జరిగాయి. జీరో అవర్ తో పాటు క్వశ్చన్ అవర్, ఇతర ఎజెండాలు కూడా అనుకున్నట్టుగానే జరిగాయి. దీంతో రాజ్యసభ చరిత్ర సృష్టించిందని చైర్మన్, ఉపరాష్ట్రప‌తి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆ సమయంలో సభ్యులు హర్షాతిరేకాల మధ్య బల్లలు చరిచారు. సభ్యుల సహకారం బాగుందని, అందుకే సభ సజావుగా సాగిందని, అందుకే హౌజ్‌లో ఈ రికార్డును నెలకొల్పామని వెంకయ్య అన్నారు. భవిష్యత్తులోనూ సభ ఇలాగే సాగాలని ఆయన ఆకాంక్షించారు. అయితే గత కొన్ని రోజులుగా వివిధ కారణాల వల్ల సభ సజావుగా సాగలేదు. ఇవాళ సభలో మొత్తం పది ప్రశ్నలను చర్చించారు. జీరో అవర్ సబ్‌మిసన్‌తో పాటు మాజీ సభ్యుడు మరగబందు మృతి పట్ల నివాళి అర్పించారు.

ఇదిలాఉండ‌గా...రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన రుణం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తు గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స‌వివ‌ర స‌మాధానం ఇచ్చారు. రాజధాని నగరం అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు రూ.3.324 కోట్ల రుణం కోరుతూ ఏపీ ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకుందని ఈ దరఖాస్తు ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పెట్టుకున్న ఈ ద‌ర‌ఖాస్తు విష‌యంలో ప్రపంచబ్యాంకు ప‌రిశీల‌న ఇంకా ప్రాథమిక దశలో ఉందని కేంద్ర మంత్రి వివ‌రించారు. రాజ‌ధాని ప్రాజెక్టుకు సంబంధించి ప్ర‌పంచ బ్యాంక్ పూర్తిస్థాయి మదింపు చేస్తోంద‌ని పేర్కొంటూ...ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వంతో రుణానికి సంబంధించిన సంప్రదింపులు ప్రారంభమవుతాయని వివ‌రించారు. అనంత‌ర‌మే రుణాన్ని మంజూరు చేస్తుందని కేంద్ర మంత్రి వివ‌రించారు.

మ‌రోవైపు గత మూడేళ్లలో 580 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ అహిర్ తెలిపారు. ఇవాళ ఆయన సభలో మాట్లాడారు. ఉగ్రవాదులను హతమార్చుతున్న సంఖ్య పెరిగినట్లు ఆయన చెప్పారు. 2010 నుంచి 2013 మధ్య సుమారు 471 మంది ఉగ్రవాదులను చంపేశారని, ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 580 మంది హతమార్చామని మంత్రి స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వం సాధించిన ప్రగతి అని అన్నారు. భద్రతా దళాల జీవితాలను ప్రభుత్వం లెక్క చేయడం లేదని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా సభలో ప్రశ్నించారు. ఫిదాయేన్ దాడులు ఎక్కువైనట్లు ఆయన ఆరోపించారు. సీఆర్‌ పీఎఫ్ కేంద్రంపై దాడికి సంబంధించిన సమాచారం ముందే వచ్చినా.. ప్రభుత్వం సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన నిలదీశారు.