Begin typing your search above and press return to search.

జస్ట్ 10 నిమిషాల్లో రూ.854 కోట్లు సంపాదించాడు

By:  Tupaki Desk   |   8 Oct 2021 3:20 AM GMT
జస్ట్ 10 నిమిషాల్లో రూ.854 కోట్లు సంపాదించాడు
X
రెండు పాటలు విన్నంత సమయం.. ఒక ఛాయ్ ను.. కాఫీని కానీ అస్వాదిస్తూ తాగేందుకు పట్టే సమయం కంటే తక్కువ వ్యవధిలో ఎవరైనా ఎంత సంపాదించగలరు? అంటే.. కాసింత పిచ్చిగా చూడటం ఖాయం. పది నిమిషాల్లో ఎంత సంపాదిస్తారు? ఇదేమైనా సినిమానా? అని ఎటకారపు మాట అనేస్తారు. నిజమే.. సాదాసీదా వారిని ఇలాంటి ప్రశ్న అడిగితే.. ఇలాంటి సమాధానాలే వస్తాయి. కానీ.. ప్రతి నిమిషాన్ని సంపదను క్రియేట్ చేయటమే పనిగా పెట్టుకునే వారి సంగతి కాస్త భిన్నం. వారి సంపాదన ఎలా ఉంటుందనటానికి నిదర్శనంగా తాజాగా ప్రఖ్యాత బిగ్ బుల్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా నిలిచారు.

తాజాగా అతడు కేవలం పది నిమిషాల వ్యవధిలో రూ.850 కోట్ల సంపాదించిన రికార్డును క్రియేట్ చేశారు. తన సత్తాను చాటారు. అంత స్వల్ప వ్యవధిలో అంత భారీగా ఎలా సంపదను క్రియేట్ చేయగలిగారు? ఆ మేజిక్ ఏమిటన్నది చూస్తే.. ఆయనకున్న షేర్లలో కీలకమైన ఒక షేరు భారీగా పెరగటమే దీనికి కారణంగా చెప్పాలి.

బెట్ టైటాన్ షేర్ ధర భారీగా పెరిగింది. దాదాపు 10 శాతం ర్యాలీ చేసింది. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే మార్కెట్ క్యాపిటల్ భారీగా పెరిగేలా చేసింది. ఈ షేర్ పుణ్యమా అని.. మార్కెట్ క్యాపిటల్ కు రూ.17,770 కోట్లను ఈ కంపెనీ కారణంగా పెరిగిన పరిస్థితి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత టైటాన్ షేర్లు 9.32 శాతం పెరిగి.. ఏకంగా రూ.2347 కు చేరుకుంది. ఇది రికార్డు స్థాయిగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు, ఆయన భార్యకు కలిపి 4.81 శాతం షేర్లు ఉండటంతో వారి వాటా విలువ ఒక్కసారిగా రూ.854 కోట్లకు పెరిగింది. దీంతో.. కంపెనీలో ఆయన వాటా మొత్తంగా రూ.10వేల కోట్లకు చేరుకుంది. పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని మదుపరులు భారీగా పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 78 శాతం వృద్ధిని టైటాన్ సాధించటం గమనార్హం.