Begin typing your search above and press return to search.

బీజేపీ నేతలను చంపడం నేరం కాదు.. చర్యకు ప్రతి చర్య: టికాయత్

By:  Tupaki Desk   |   9 Oct 2021 4:30 PM GMT
బీజేపీ నేతలను చంపడం నేరం కాదు.. చర్యకు ప్రతి చర్య: టికాయత్
X
లఖింపూర్ ఖేరి ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలో రైతులు బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడడం చర్యకు ప్రతిచర్య మాత్రమేనని రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన రైతులను తాము నిందితులుగా భావించడం లేదని రైతు సంఘం నాయకులు వెల్లడించారు.

లఖింపూర్ ఖేరిలో కాన్వాయ్ వాహనంతో దూసుకెళ్లి నలుగురు రైతుల ప్రాణాలు తీశారని ఈ ఘటన అనంతరం జరిగిన ఘర్షణలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలను చంపడం చర్యకు ప్రతిచర్య మాత్రమేనని టికాయత్ పేర్కొన్నారు. హత్యలకు పాల్పడిన రైతులు చేసింది తాను నేరంగా పరిగణించను అని టికాయత్ తెలిపారు. నిరసన తెలుపుతున్న రైతులపై వాహనాన్ని ఎక్కించినందుకే ఈ విధంగా స్పందించినట్టుగా ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.

ఆశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోవడం లేదని.. పేరుకు మాత్రమే సమన్లు ఇచ్చి మంత్రి కుమారుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారని.. లఖింపూర్ ఖేరి ఘటనకు నిరసనగా అక్టోబర్ 15న దసరా సందర్భంగా దిష్టిబొమ్మలను దహనం చేస్తామని రైతు సంఘం నాయకులు ప్రకటించారు.

ముందస్తు ప్రణాళికతో పన్నిన కుట్రగా లఖింపూర్ ఖేరి ఘటనను రైతు సంఘం నాయకులు అభివర్ణిస్తున్నారు. యూపీ ప్రభుత్వం దోషులకు రక్షణ కల్పిస్తుందని ఆరోపిస్తున్నారు.

లఖింపూర్ పై మంగళవారం కవాతు చేస్తామని రైతు సంఘాలు తెలిపాయి. అక్టోబర్ 18న రైల్ రోకో , అక్టోబర్ 26న లక్నోలో మహా పంచాయతీ నిర్వహించాలని రైతులు భావిస్తున్నారు. రైతు సంఘాల నాయకులు అజయ్ మిశ్రాను తొలగించాలని.. ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.