Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ర్యాలీలు.. ఊరేగింపులపై బ్యాన్

By:  Tupaki Desk   |   5 Aug 2019 9:46 AM GMT
హైదరాబాద్ లో ర్యాలీలు.. ఊరేగింపులపై బ్యాన్
X
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం నేపథ్యంలో.. తాజాగా సరికొత్త హెచ్చరికలు జారీ అయ్యాయి. కశ్మీర్ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చే క్రమంలో భాగంగా ఆర్టికల్ 370.. 35 ఏను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం.. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తాజాగా ఒక హెచ్చరిక జారీ అయ్యింది.

అన్ని రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల విషయంలో జాగరూకతో వ్యవహరించాలని.. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లో అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కొన్ని నిర్ణయాల్ని తీసుకున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి ర్యాలీలు.. నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదని పేర్కొన్నారు.

హైదరాబాద్.. సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని 144 సెక్షన్ ను విధించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఊరేగింపులు.. ర్యాలీల్ని నిర్వహించకూడదు. ఒకవేళ అలా చేసిన పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలోని పోలీసులు.. ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని.. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిషనరేట్లు.. జిల్లాల ఎస్సీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.