Begin typing your search above and press return to search.

మెగా బాట‌!..చిరుకు హ్యాండ్‌ - ప‌వ‌న్‌ కు సపోర్ట్!

By:  Tupaki Desk   |   23 Jan 2018 11:23 AM GMT
మెగా బాట‌!..చిరుకు హ్యాండ్‌ - ప‌వ‌న్‌ కు సపోర్ట్!
X
మెగా ఫ్యామిలీ... టాలీవుడ్‌ లో తిరుగు లేని కుటుంబం కిందే లెక్క‌. ఎందుకంటే... మెగా ఫ్యామిలీ మాదిరిగా డ‌జ‌నుకు పైగా న‌టులున్న కుటుంబ‌మే టాలీవుడ్‌ లో క‌నిపించ‌దు. సినీ ప‌రిశ్ర‌మ‌తో ఏమాత్రం ప‌రిచ‌యం లేకుండానే ధైర్యంగా అడుగు వేసిన చిరంజీవి... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత ఆయ‌నకు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో పాటుగా ల‌క్ష‌లాది మంది అభిమానులు పుట్టుకొచ్చారు. ఆ త‌ర్వాత అస‌లు సీనే మారిపోయింద‌ని చెప్పాలి. చిరు ఫ్యామిలీ నుంచి ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు తెరంగేట్రం చేసినా... కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాగా... చిన్న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం చిరు సోద‌రుడిగానే ఎంట్రీ ఇచ్చినా... ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కంటే కూడా కాస్తంత ఎక్కువ మోతాదులో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌ ను సంపాదించుకున్నాడు. అంత‌కంటే ముందుగానే త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు య‌త్నించిన చిరు బావ‌మ‌రిది అల్లు అర‌వింద్‌... త‌న ర‌క్తంలో యాక్టింగ్ జీన్స్ ఉన్నా... స‌క్సెస్ కాలేక‌పోయారు. అయితే చిరు స‌హ‌కారంతో పెద్ద నిర్మాత అయ్యారు. ఆ త‌ర్వాతి కాలంలో అటు మెగా స్టార్ కుటుంబం నుంచే కాకుండా... ఇటు నాగ‌బాబు కుటుంబం నుంచి, అటు అల్లు అర‌వింద్ కుటుంబం నుంచి - వారి బంధు వ‌ర్గానికి చెందిన కుటుంబాల నుంచి స్టార్ హీరోలు వ‌చ్చేశారు.

మెగా స్టార్ చిరు కుమారుడిగా తెరంగేట్రం చేసిన రాంచ‌ర‌ణ్ తేజ్‌... ఇప్పుడు టాలీవుడ్‌ లో టాప్ స్టారే. అల్లు అర‌వింద్ కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న కుమారుడు అల్లు అర్జున్ కూడా... ఇంచూమించూ రాంచ‌ర‌ణ్ మాదిరి స్టార్ డ‌మ్‌ ను సంపాదించుకున్నాడు. ఇక నాగబాబు కుమారుడు వ‌రుణ్ తేజ్‌ - చిరు మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ - అల్లు అర్జున్ త‌మ్ముడు అల్లు శిరీష్‌ - నాగ‌బాబు కూతురు నీహారిక బాగానే రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు చిరు అల్లుడి హోదాలో చిన్న క‌ల్యాణ్ కూడా తెరంగేట్రానికి రంగం సిద్ధం అవుతోంది. వెర‌సి మెగా ఫ్యామిలీ నుంచి మ‌రింత మంది న‌టులు రాబోతున్న‌ట్లుగానే చెప్పుకోవాలి. అయినా ఈ విష‌యాల‌న్నీ ఇప్పుడెందుకంటే.... మొన్న‌టిదాకా ఒక్క ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ప్పించి మిగిలిన వారంతా మెగాస్టార్ వెంటే న‌డిచారు. 2008లో ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన చిరుకు నాగ‌బాబు - అల్లు అర‌వింద్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ తోడూనీడ‌గా ఉన్నారు. అయితే సినిమాల్లో మాదిరి.. రాజ‌కీయాల్లో చిరు రాణించ‌లేక‌పోయారు. ఫ‌లితంగా పార్టీని క్లోజ్ చేసిన చిరు.. కాంగ్రెస్‌ లో చేరిపోయి కేంద్ర మంత్రిగా త‌న ముచ్చ‌ట‌ను తీర్చుకున్నారు.

ఈ ప‌రిణామం చిరు నుంచి ప‌వ‌న్‌ ను వేరు చేసేసింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ను ప‌క్క‌న‌పెట్టేసిన మెగా ఫ్యామిలీ మొత్తంగా చిరు వెంటే నడిచింది. ఇది నిన్న‌టిదాకా ప‌రిస్థితి. మ‌రి ఇప్పుడేం మార్పు వ‌చ్చిందంటే... నిన్న‌టిదాకా చిరు వెంట న‌డిచిన మొత్తం మెగా ఫ్యామిలీ ఇప్పుడు ప‌వ‌న్ వెంట న‌డిచేందుకు సిద్ధ‌మైపోయింది. నిజ‌మా... అంటే నిజ‌మే మ‌రి. ఎందుకంటే ఎలాగూ చిరు ఇప్పుడు రాజ‌కీయాల్లో అంత క్రియాశీలంగా లేరు క‌దా. కాంగ్రెస్ పార్టీ నేత‌గా ఉన్న‌ప్ప‌టికీ... చిరు ఆ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పెద్ద‌గా పాలుపంచుకుంటున్న‌ది లేదు. రాజ‌కీయాల్లో ఫెయిల్ అయిన త‌ర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు.... మంచి హిట్ నే సాధించేసి... త‌దుప‌రి కూడా న‌టుడిగానే కొన‌సాగేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లుగా ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పేరిట పార్టీని ఏర్పాటు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... నిన్న తెలంగాణ‌లో ఛ‌లోరే ఛ‌లోరే ఛ‌ల్ పేరిట యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ప్రారంభ‌మైన వెంట‌నే మెగా ఫ్యామిలీ హీరోల నుంచి వ‌రుస‌గా ప‌వ‌న్‌ కు మ‌ద్ద‌తు వెల్లువెత్తింది.

మొద‌టిగా చిరు కుమారుడు రాంచ‌ర‌ణ్ తేజ్ ఫేస్‌ బుక్ వేదిక‌గా...బాబాయి యాత్ర విజ‌య‌వంత‌మ‌వ్వాల‌ని కోరుతూ ఆస‌క్తిక‌ర మెసేజ్ పోస్ట్ చేశారు. ఆ వెంట‌నే సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా *మీ వెంటే మేము* అంటూ ట్వీటారు. ఆ కొద్దిసేప‌టికే ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ తేజ్... బాబాయికి ఆల్ ద బెస్ట్ చెబుతూనే బాబాయికి మ‌రింత శ‌క్తి రావాల‌ని ఆకాంక్షించారు. మొత్తంగా నిన్న‌టిదాకా చిరుతో న‌డిచిన వీరు ఇప్పుడు మూకుమ్మ‌డిగా ప‌వ‌న్‌ కు మ‌ద్ద‌తు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేసిన వైనం నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. చిరుకు హ్యాండిచ్చేసిన వీరంతా... ప‌వ‌న్ బాట ప‌ట్టారా? లేదంటే... తాను ఎలాగూ రాజ‌కీయాల‌కు దూరంగా జ‌రుగుతున్నందున చిరునే వారిని ప‌వ‌న్ వ‌ద్ద‌కు పంపారా అన్న‌ది తేలాల్సి ఉంది. మొత్తానికి మోగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ప‌వ‌న్ స్టార్ బాట ప‌ట్టేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.