Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ల‌కు బదులివ్వ‌ని ఆ ఇద్ద‌రూ!

By:  Tupaki Desk   |   3 May 2019 6:35 AM GMT
ఫైర్ బ్రాండ్ల‌కు బదులివ్వ‌ని ఆ ఇద్ద‌రూ!
X
రెండు వేర్వేరు రంగాల‌కు చెందిన ఇద్ద‌రు ప్ర‌ముఖులు.. ఒకే స‌మ‌యంలో.. ఇంచుమించు ఒకేలా వ్య‌వ‌హ‌రించిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు ప్ర‌ముఖులు ఎవ‌రంటే.. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా.. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో త‌ర‌చు వార్త‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చే రాంగోపాల్ వ‌ర్మ అందులో ఒక‌రైతే.. తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై అదే ప‌నిగా పంచ్ లు వేసే కేటీఆర్ మ‌రొక‌రుగా చెప్పాలి.

గ‌డిచిన ఐదు రోజులుగా వారిద్ద‌రూ ఒకేలాంటి ప‌రిస్థితి ఎదుర్కొన్నార‌ని చెప్పాలి. ఆస‌క్తిక‌రంగా ఇరువురు ఒకే తీరును ప్ర‌ద‌ర్శించ‌టం విశేషం. మొద‌ట రాంగోపాల్ వ‌ర్మ విష‌యానికి వ‌స్తే.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుద‌ల అంశంపై ప్రెస్ మీట్ పెట్టేందుకు విజ‌య‌వాడ‌కు వెళ్లిన ఆయ‌న‌.. అక్క‌డ పోలీసులు అడ్డుకున్న వైనంపై చేసిన ఘాటు ట్వీట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఏపీ ముఖ్య‌మంత్రి మీదా.. ఏపీ పోలీసుల మీదా ఆయ‌న ఒక స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ ఎపిసోడ్ పై టీడీపీ మ‌హిళా ఫైర్ బ్రాండ్లు యామిని సాధినేని.. సీనియ‌ర్ న‌టి దివ్య‌వాణిలు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దివ్య‌వాణి అయితే ఒక అడుగు ముందుకేసి.. వ‌ర్మ నీకు ద‌మ్ముంటే జ‌గ‌న్ నెగిటివ్ యాంగిల్ మీద సినిమా తీసే ద‌మ్ముందా? అని క్వ‌శ్చ‌న్ చేశారు. సాధార‌ణంగా ఎవ‌రైనా త‌న‌ను ఉద్దేశించి ఘాటు విమ‌ర్శ చేసినా.. ప్రెస్ మీట్ పెట్టి తిట్టినా చ‌టుక్కున స్పందించే వ‌ర్మ‌.. దాదాపు ఐదు రోజులుగా ఈ ఇష్యూ మీద కామ్ గా ఉన్నారు.

ఇక‌.. కేటీఆర్ విష‌యానికి వ‌స్తే.. ఇంట‌ర్ బోర్డు వివాదం విష‌యంలో మౌనంగా ఉన్న ఆయ‌న‌.. ఒక ద‌శ‌లో నోరు విప్పారు. అనంత‌రం ఆచితూచి అన్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌.. ఆదివారం ఆస్క్ కేటీఆర్ పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో గ్లోబ‌రీనా సంస్థ మీద క్లారిటీ ఇచ్చే క్ర‌మంలో త‌న‌కు.. ఆ సంస్థ‌కు సంబంధం లేద‌ని పేర్కొన్నారు. దీంతో.. రేవంత్ రెడ్డి.. వీహెచ్ లు ఈ అంశాల్ని ప‌ట్టుకొని.. బ‌ల‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు. గ్లోబ‌రీనాతో సంబంధం లేద‌న్న కేటీఆర్.. పెద్ద‌మ్మ గుడి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ప్ర‌మాణం చేస్తారా? అంటూ స‌వాల్ విసిరిన వీహెచ్ ను.. బ‌ఫున్ అంటూ కేటీఆర్ మండిప‌డ్డారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేప‌ట‌మే కాదు..వీహెచ్ య‌మా సీరియ‌స్ అయితే.. రేవంత్ రెడ్డి నిప్పులు చిమ్మిన ప‌రిస్థితి. చివ‌ర‌కు ఎలాంటి ప‌రిస్థితి ఉందంటే.. గ్లోబ‌రీనా విష‌యాన్ని నోరు విప్పి ఒక్క మాట చెప్పినా.. కొత్త ర‌చ్చ అవుతుందేమో అన్న‌ట్లుగా కేటీఆర్ అనుకునే వ‌ర‌కూ వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. కేటీఆర్ సైతం మౌనాన్ని ఆశ్ర‌యించ‌టం విశేషం. త‌మ‌పై ఊహించ‌నిరీతిలో మొద‌లైన ఎదురుదాడితో ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖులు మౌనంగా ఉండిపోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.