Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి మ‌ర‌ణంపై వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   1 March 2018 8:28 AM GMT
శ్రీ‌దేవి మ‌ర‌ణంపై వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మ‌ర‌ణవార్త‌పై అంద‌రూ స్పందించారు. కానీ.. కోట్లాది మంది స్పందించినా.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ చేసిన‌న్ని ట్వీట్లు.. పెట్టిన‌న్ని మెసేజ్ లు.. శ్రీ‌దేవిపై త‌న‌కున్న ఆరాధ‌నా భావాన్ని ఆయ‌న ప్ర‌క‌టించినంత బాగా ఏ ఒక్కరూ వ్య‌క్తిగ‌తంగా చేయ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆమెతో త‌న‌కున్న ప‌రిచ‌యం మొద‌లు.. ఆమెను తానెంత‌గా ఆరాధిస్తానో చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీ‌దేవి మ‌ర‌ణంపై వ‌ర్మ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆమె మ‌ర‌నం వెన‌కున్న నిజ‌మైన కార‌ణం ఏమిటంటూ ప్ర‌శ్నించి క‌ల‌క‌లం రేపారు. శ్రీ‌దేవి మ‌ర‌ణం విష‌యంలో మీడియా ఉదాసీనంగా ఉండ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు.

ఓప‌క్క శ్రీ‌దేవి మ‌ర‌ణంపై మీడియాలో వ‌చ్చిన వార్త‌ల విష‌యంపై ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ప్పు ప‌డుతుంటే.. అందుకు భిన్నంగా వ‌ర్మ మాత్రం మ‌రోలా రియాక్ట్ అయ్యారు. శ్రీ‌దేవి మ‌ర‌నంపై దుబాయ్ పోలీసులు చెప్పిన విష‌యాన్ని భార‌త మీడియా అంత సులువుగా ఎలా న‌మ్మేసింద‌ని ప్ర‌శ్నించారు.

ఇండియాలో జ‌రిగిన అరుషి.. ఇంద్రాణి త‌ర‌హా కేసుల గురించి జ‌ర్న‌లిస్టులు చాలా హ‌డావుడి చేశార‌ని.. సొంతంగా విచార‌ణ జ‌రిపార‌ని.. అలాంటిది శ్రీ‌దేవి మ‌రణంపై దుబాయ్ పోలీసులు చేసిన నాలుగు లైన్ల ట్వీట్ ను ఎలా న‌మ్మేశారన్నారు. కేసు క్లోజ్ అయిపోయిందంటే ఎందుకు ఊరుకున్నారు? అని ప్ర‌శ్నిస్తున్నారు.

శ్రీ‌దేవి మ‌ర‌ణంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కూడా దుబాయ్ పోలీసులు అనుకోలేద‌ని.. శ్రీ‌దేవి బాత్ ట‌బ్ లో ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌నిగి చ‌నిపోయిన‌ట్లుగా చెప్పి కేసు క్లోజ్ చేశార‌న్నారు. ఫోరెన్సిక్.. ఎంబామింగ్ స‌ర్టిఫికేట్లో చాలా త‌ప్పులు.. అక్ష‌ర‌దోషాలు ఉన్నాయ‌న్న ఆయ‌న‌.. శ్రీ‌దేవి మ‌ర‌ణానికి దారి తీసిన ప‌రిస్థితులను.. విచార‌ణ తీరును బ‌య‌ట ప్ర‌పంచానికి వెల్ల‌డించాల‌ని దుబాయ్ పోలీసుల‌పై భార‌త స‌ర్కారు.. మీడియా ఒత్తిడి తేవాల‌న్నారు. శ్రీ‌దేవి మ‌ర‌ణంపై మ‌రే సినీ ప్ర‌ముఖుడు రియాక్ట్ కాని రీతిలో రియాక్ట్ అయిన వ‌ర్మ మాట‌లకు ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.