Begin typing your search above and press return to search.

మతి పోయిందంటూ ఆ జడ్జికి జెఠ్మలానీ లేఖ

By:  Tupaki Desk   |   13 March 2017 7:01 AM GMT
మతి పోయిందంటూ ఆ జడ్జికి జెఠ్మలానీ లేఖ
X
ఈ దేశంలో లాయర్లు చాలామందే ఉన్నారు. కానీ.. వారందరికి భిన్నమైన వ్యక్తి ప్రఖ్యాత సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ. ఎలాంటి కేసునైనా తనదైన శైలిలో డీల్ చేసే ఆయన గురించి న్యాయవాద వర్గాలు చాలా గొప్పగా చెబుతుంటాయి. ప్రముఖులు ఎవరైనా కానీ న్యాయపరమైన ఇష్యూస్ లో చిక్కుకుపోతే అలాంటి వారికి చప్పున గుర్తుకు వచ్చేది రాం జెఠ్మలానీనే. రెమ్యూనరేషన్ ను గంటల చొప్పున ఛార్జ్ చేసే ఆయనకు న్యాయపరమైన అంశాల్లో ఉన్నపట్టు అంతాఇంతా కాదు. అలాంటి ఆయన..తాజాగా కోల్ కతాహైకోర్టు న్యాయవాది జస్టిస్ కర్ణన్ కు ఘాటు లేఖ రాశారు.

తన వైఖరితో వివాదాస్పద న్యాయమూర్తిగా ముద్ర వేసుకున్న జస్టిస్ కర్ణన్.. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిలపై మండిపడుతూ చేసిన వ్యాఖ్యలపై రాంజెఠ్మలానీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆయన తీరును తీవ్రంగా తప్పు పడుతూ బహిరంగ లేఖ రాసిన ఆయన అందులో జస్టిస్ కర్ణన్ ను ఉద్దేశించి ఘాటైన పదజాలాన్ని వాడారు. తాను దళితుడ్ని కావటంతో తనను టార్గెట్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జస్టిస్ కర్ణన్ తీరును తీవ్రంగా తప్పు పట్టిన రాంజెఠ్మలానీ తన లేఖలో ఆయన్ను.. ‘‘మీకు మతిపోయిందని నేను నమ్ముతున్నా’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.

ప్రియమైన న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ అంటూ తన లేఖను స్టార్ట్ చేసిన జెఠ్మలానీ.. ‘‘నేను ఇప్పటివరకూ మిమ్మల్ని కలవలేదు. మీ గురించి వినలేదు. కానీ.. ఇలా చెబుతున్నందుకు సారీ. మీకు మతిపోయిందని నేను నమ్ముతున్నా. బార్ లో ఒకసీనియర్ సభ్యుడిగా మీకొక సలహా ఇస్తున్నా. అదేమిటంటే.. ఇన్నాళ్లుగా మీరు చేసిన తెలివితక్కువ పనికీ వినయంగా సారీ కోరుకోండి. మీ ఉన్మాదంఎంత తీవ్రస్థాయికి చేరుకుందో మీకు తెలీకపోతే దయచేసి నన్ను కలవండి.మీకు నేను వివరిస్తా. ఈ వృద్ధుడు ఇస్తున్న సలహాను దయచేసి వినండి’’ అంటూ రాశారు. ఎవరి మీదనైనా ఎంత మాట అంటే అంత మాట అనేసే జస్టిస్ కర్ణన్.. జెఠ్మలానీ లేఖపై ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/