Begin typing your search above and press return to search.

వామ్మో.. మరీ అంత విధేయత ఏంటి జెఠ్మలానీ

By:  Tupaki Desk   |   4 July 2016 6:17 AM GMT
వామ్మో.. మరీ అంత విధేయత ఏంటి జెఠ్మలానీ
X
మేధావుల మౌనం ఎంత ప్రమాదకరమో.. అట్టే మాట్లాడటం.. అనవసర వ్యాఖ్యలు చేయటం కూడా అంతే చేటు. ఆచితూచి మాట్లాడాల్సిన వారు ఇష్టారాజ్యంగా.. బాధ్యత లేకుండా మాట్లాడేస్తే అదే అందరికి ఆదర్శమవుతుంది. విధేయత తప్పు కానీ.. కానీ మోతాదుకు మించిన విదేయతతో పెను నష్టమే. స్థాయి ఎంత ఉన్నా.. మనిషిని హుందాతనం నుంచి పక్కకు నెట్టేసేలా చేయటంలో పక్షపాతానికి మించింది మరొకటి ఉండదు.ప్రముఖ న్యాయకోవిదుడు.. తన క్లయింట్ల దగ్గర గంటల చొప్పున ఫీజు వసూలు చేసే రాంజెఠ్మలానీ తాజాగా చేసిన వ్యాఖ్య వింటే కాస్తంత షాక్ తినాలే.

మొదట్లో బీజేపీ తరఫున ఉండి.. ఆ మధ్య కమలనాథులకు దూరంగా జరిగిపోయిన ఆయన.. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అధికారపక్షం నుంచి రాజ్యసభకు ఎంపిక కావటం తెలిసిందే. తనకు టిక్కెట్టు ఇచ్చి.. రాజ్యసభకు పంపిన అభిమానమో మరేమో కానీ.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ ను ఈ పెద్దమనిషి విపరీతంగా పొగిడేస్తున్నారు. అదే సమయంలో.. ప్రధాని మోడీ మీద నిప్పులు చెరుగుతున్నారు.

‘‘నేను తప్పు చేశాను. మోడీని ప్రధానిగా సమర్థించిన నేను అపరాధిని.ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పారు. కానీ..ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ ఆ మాటను నిలబెట్టుకోలేదు.ఇక ముందు కూడా తాను చెప్పిన మాటను నెరవేరుస్తారన్న నమ్మకం లేదు. అందుకే మీరెవరూ మోడీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మోద్దు’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇంతవరకూ చెప్పినా రాంజెఠ్మాలానీని తప్పు పట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. చివర్లోనే ఆయన అసలు విషయాన్ని చెప్పేశారు. సమాజ్ వాదీ సింధీ సభకు హాజరైన ఆయన.. తనను రాజ్యసభకు పంపిన అఖిలేష్ యాదవ్ పట్ల తనకున్న అభిమానాన్ని మాటల్లో మార్చి.. ‘‘యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ మీద ఎలాంటి మచ్చా లేదు. అతడే ఈ దేశానికి భవిష్యత్తు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి లాయర్లు తమ మాటల్లో ఎక్కడా దొరికిపోరని చెబుతారు. అందుకు భిన్నంగా మొనగాడి లాయర్ అని చెప్పుకునే రాంజెఠ్మాలనీ చిత్రంగా తన మాటలతో.. అఖిలేశ్ మీద తనకున్న విదేయతను తన మాటలతో చెప్పేసి అందరికి దొరికిపోవటం గమనార్హం. ఎంత రాజ్యసభకు వెళ్లే ఛాన్ష్ ఇస్తే మాత్రం.. మరీ అంతగా పొగిడేయాలా..?