Begin typing your search above and press return to search.

రేవంత్ - కోమ‌టిరెడ్డి..డీల్ కుదిర్చే నేత ఆయ‌నే

By:  Tupaki Desk   |   7 May 2017 7:21 AM GMT
రేవంత్ - కోమ‌టిరెడ్డి..డీల్ కుదిర్చే నేత ఆయ‌నే
X
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఇటీవ‌ల ర‌చించిన `ఆపరేషన్ సెవెన్ స్టేట్స్` లో భాగంగా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు కాషాయ పార్టీ తెరతీసింది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వ‌ర్ గౌడ్ కాషాయ కండువా క‌ప్పుకున్నారు. మే నెల చివరి వారంలో కమలదళపతి అమిత్ షా తెలంగాణాలో మూడు రోజులు పర్యటిస్తున్న నేపథ్యంలో ప‌లువురు సీనియ‌ర్లు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధం అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఉత్తరాది విజయంతో ఊపుమీదున్న బీజేపీ తెలంగాణపై కన్నేసి స్ప‌ష్ట‌మైన‌ యాక్షన్ ప్లాన్‌తో వ‌స్తున్న నేప‌థ్యంలో ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే రాష్ట్రంలోని కమలదళ నేతలు వారి ప్రయత్నాలకు మోకాలడ్డుతున్న నేప‌థ్యంలో ఢిల్లీ స్థాయిలో చ‌క్రం తిప్ప‌గ‌లిగే నాయ‌కుల ద్వారా బీజేపీలోకి నేత‌ల ఎంట్రీ ఉంటుంద‌ని అంటున్నారు.

అమిత్ షా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బీజేపీలో చేరే నేత‌ల విష‌యంలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేర్లు టీడీపీ ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష ఉప‌నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ఆయ‌న సోద‌రుడైన ఎమ్మెల్సీ రాజ‌గోపాల్ రెడ్డి. ఈ ముగ్గురు నేత‌ల‌తో స‌హా ప‌లువురు సీనియ‌ర్లు బీజేపీపై మోజు చూపుతున్న‌ట్లు మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తెలంగాణ బీజేపీలో ముఖ్యనేతలు ఎవ్వరూ ఇతర పార్టీల నుంచి వచ్చే ముఖ్యనేతలకు అవకాశమివ్వకపోవడంతో కమలంపార్టీపై ఆసక్తి ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌ నేతలంతా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు నేతలు ఆశ్ర‌యిస్తున్న వ్య‌క్తి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి స‌న్నిహితుడ‌నే పేరున్న తెలుగు నాయ‌కుడు, బీజేపీ జాతీయ‌ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్!

అమిత్ షా ప‌ర్య‌ట‌న ద్వారా తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల కోసం కూడికలు , తీసివేతలు అపుడే మొదలు పెట్టిన నేప‌థ్యంలో త‌మ పార్టీ వైపు వ‌చ్చే నేత‌ల కోసం రాంమాధ‌వ్ ఢిల్లీ స్థాయిలో చ‌క్రం తిప్పుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్దికాలం క్రితం రామ్ మాధ‌వ్ తో కలిసి అమిత్ షాతో రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ జరుగుతోంది. మ‌రోవైపు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో కాంగ్రెస్ పార్టీ భ‌రోసా ఇవ్వ‌క‌పోవ‌డంతో కోమటిరెడ్డి బ్రదర్స్ సైతం కమలం పార్టీలో చేరడానికి మధ్యవర్తి కోసం వెతుకున్నట్లు తెలుస్తోంది. వీరి విష‌యంలోనూ రాంమాధ‌వ్ చొర‌వ ఉంటుంద‌ని చెప్తున్నారు. మొత్తంగా టీడీపీ-కాంగ్రెస్‌లోని ప‌లువురు నేతలు పువ్వుగుర్తు పార్టీలోకి చేరే ప్రయత్నాలు వేగిరం అయ్యాయి అనేది బీజేపీ శ్రేణులు చెప్తున్న మాట‌!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/