Begin typing your search above and press return to search.

ఎట‌కార‌పు మాట‌ల్ని టెక్నిక‌ల్ గా స‌ర్ది చెప్ప‌ట‌మా?

By:  Tupaki Desk   |   15 May 2019 5:52 AM GMT
ఎట‌కార‌పు మాట‌ల్ని టెక్నిక‌ల్ గా స‌ర్ది చెప్ప‌ట‌మా?
X
ప్ర‌జ‌లేమీ అమాయకులు కారు. గ‌తంలో మాదిరి వారిని మాట‌ల‌తో స‌ర్ది చెప్పే అవ‌కాశం ఇప్పుడు లేదు. సోష‌ల్ మీడియా హ‌ల్ చ‌ల్ చేస్తున్న వేళ‌.. స‌ర్దిచెప్పే కార్య‌క్ర‌మం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. న‌ష్టం జ‌రిగిన‌ప్పుడు దాన్ని దిద్దుబాటుకు ఎంత‌గా ట్రై చేస్తారో.. ప్ర‌త్య‌ర్థులు అంతే ఎక్కువ‌గా డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఇలాంటివేళ‌.. సాంకేతిక అంశాల్ని తెర మీద‌కు తెచ్చేసి.. మా బాస్ చెప్పింది నిజ‌మే అన్న వాద‌న సామాన్య ప్ర‌జానీకాన్ని ఆక‌ట్టుకోద‌న్న వాస్త‌వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవ‌సరం ఉంది.

ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ చెప్పిన రాడార్ ముచ్చ‌ట ఇప్పుడు ఎట‌కార‌పు ఇష్యూగా మార‌ట‌మే కాదు.. ఐదేళ్ల‌లో ఇంత దారుణ ప‌రిస్థితిని ఆయ‌న ఎప్పుడూ ఎదుర్కోలేద‌ని చెప్పాలి. మ‌బ్బులున్న‌ప్పుడే బాలాకోట్ దాడులు చేస్తే పాక్ రాడార్ల‌కు చిక్క‌బోమ‌ని వైమానిక ద‌ళానికి తాను స‌ల‌హా ఇచ్చిన‌ట్లుగా ప్ర‌ధాని మోడీ ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పుకోవ‌టం తెలిసిందే.

ఈ అంశం ఎట‌కారంగా మార‌ట‌మే కాదు.. ప‌లువురు మోడీపై భారీ ఎత్తున పంచ్ లు వేయ‌టం షురూ చేశారు. సోష‌ల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. మోడీ మాట‌ల వ‌ల్ల జ‌రిగిన డ్యామేజ్ ను గుర్తించిన బీజేపీ.. ఆయ‌న మాట్లాడిన వీడియోల్ని తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇలాంటివేళ‌.. మోడీ మాట‌లు సాంకేతికంగా నిజం తెలుసా? అంటూ మోడీకి అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌రైన రాంమాధ‌వ్ వ్యాఖ్యానించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాను సాంకేతిక నిపుణుడ్ని కాద‌ని.. విద్యావేత్త‌ను మాత్ర‌మేన‌ని.. అందుకే మోడీ మాట్లాడిన మాటల్లో త‌ప్పు ఏమైనా ఉందా? అని తానో ప్ర‌ముఖ నిపుణుడ్ని క‌లిశాన‌ని.. ఆయ‌న మోడీ మాట్లాడిన మాట‌ల్లో అస్స‌లు త‌ప్పు లేద‌న్న‌ట్లుగా చెప్పార‌న్నారు.

దేశంలోనే అత్యున్న‌త‌స్థాయి నానో టెక్నాల‌జిస్టు ఒక‌రు రాడార్ల‌కు సంబంధించిన విష‌యాల్ని తాను చెబుతున్న‌ట్లుగా పేర్కొంటూ ఆయ‌న త‌న వాద‌న‌ను సుదీర్ఘంగా వినిపించారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల ప్ర‌భావం రాడార్ల‌పైన ఉండ‌ద‌ని చెబుతున్న వారిని ఆయ‌న సూడో నిపుణులుగా అభివ‌ర్ణించారు. మొత్తంగా చూస్తే రాంమాధ‌వ్ ప్ర‌య‌త్న‌మంతా మోడీ మాష్టారు త‌ప్పుగా మాట్లాడ‌లేద‌ని.. త‌మ ప్ర‌ధాని అత్యంత మేధావి అన్న విష‌యాన్ని చాటి చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో నిజం ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. రాడార్ల విష‌యంలో మోడీ న‌వ్వుల‌పాలు కావ‌ట‌మే కాదు.. న‌మ్మ‌ద‌గిన వ్యాఖ్య‌లుగా ప్ర‌జ‌లు భావిస్తున్న వైనాన్ని గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. ఎట‌కారంగా మారిన రాడార్ల ఎపిసోడ్ ను టెక్నిక‌ల్ గా నిజ‌మ‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం రాంమాధ‌వ్ లాంటోళ్లు చేయ‌కుండా ఉంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. న‌వ్వుల‌పాలైన అంశాన్ని న‌మ్మ‌ద‌గిన అంశంగా మార్చ‌టానికి ఖ‌ర్చు చేసే వ‌న‌రుల్ని వేరే విష‌యాల మీద ఫోక‌స్ చేస్తే మంచిదంటున్నారు. రాంమాధ‌వ్ కు ఇలాంటి మాట‌లు వినిపిస్తాయా?