Begin typing your search above and press return to search.

తర్వాత పీఎం తెలుగు అతనేనా?

By:  Tupaki Desk   |   28 Jun 2019 5:02 PM GMT
తర్వాత పీఎం తెలుగు అతనేనా?
X
రాజు పోతే రాజరికం ఆగిపోతుందా.? తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అలాగే ఉంది. వారసుడు లోకేష్ బాబు అంత ప్రభావవంతంగా లేకపోవడంతో వచ్చే ఐదేళ్ల ముగిశాక.. చంద్రబాబు తర్వాత టీడీపీ పరిస్థితేంటన్నది అంతుచిక్కడం లేదు. ఇక కేసీఆర్ వయసు రీత్యానే తన కొడుకు కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేయడం.. ఆయన పార్టీని - ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడిగా ఎదగడం మనం చూశాం.. ఇదంతా వారసత్వ రాజకీయాలు నడిచే పార్టీల్లో ముచ్చట.. మరి బీజేపీలో అలా కుదరదు. అస్సలు వారసత్వ రాజకీయాలనే బీజేపీ సహించదు. అదీ కాక ఇప్పుడు నరేంద్రమోడీ తర్వాత ఎవరు అంటే.. ఆయన వారసులు లేరు.. కుటుంబమూ లేదు.. దీంతో కొత్తగా ఎవరికైనా నాయకత్వం ఇవ్వాల్సిందే.. మరి మోడీ తర్వాత ఎవరనేదే ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతున్న ప్రశ్న..?

కొందరు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేరును చెబుతారు. కానీ ఆర్ ఎస్ ఎస్ మదిలో.. బీజేపీలో అందరితో సాన్నిహిత్యంగా ఉండే జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేరు కూడా ఇప్పుడు భావి ప్రధాని రేసులో కమలం పార్టీలో వినిపిస్తుండడం విశేషం.

మోడీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల వేళనే బీజేపీ వయసు నిబంధనను ప్రవేశపెట్టారు. 75 ఏళ్లు దాటిన వారికి, అనారోగ్యంతో బాధపడే వారికి బీజేపీ టికెట్లు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. అలా అద్వానీ - మురళీ మనోహర్ జోషి సహా సుష్మా స్వరాజ్ - అరుణ్ జైట్లీలు సీట్లు దక్కక పోటీచేయలేక పదవులకు దూరమైపోయారు.

ఇప్పుడు మోడీ వయసు 68. మొన్ననే గద్దెనెక్కారు.ఇంకో ఐదేళ్లు ప్రధాని గా ఉంటారు. అప్పటికీ 73 ఏళ్లు నిండుతాయి. వయసు రీత్యానే తాను పెట్టిన నిబంధనను అనుసరించి మోడీ ప్రధాని పదవి నుంచి వచ్చే ఎన్నికల వరకు వైదొలిగే అవకాశాలు ఉండొచ్చన్నది బీజేపీ వర్గాల వాదన . అందుకే ఇప్పుడు మోడీ తర్వాత బీజేపీలో ప్రధాని ఎవరనే ప్రశ్న ఆసక్తి రేపుతోంది.

అందరూ అమిత్ షా పేరు ప్రస్తావిస్తున్నా.. అందుకు సమర్థుడైన నాయకుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అని.. ఆయన పేరును కూడా వినిపిస్తున్నారు. రాంమాధవ్ అందరితో సాన్నిహిత్యంగా ఉంటూ వివిధ రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉనికి లేని బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రాంమాధవ్ దే.. పైగా మోడీ లాగానే ఆర్ ఎస్ ఎస్ లో ఎప్పటి నుంచో ఉండి బీజేపీలో ఎదిగారు. ఆర్ ఎస్ ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మోడీ తర్వాత భావి ప్రధాని రేసులో తెలుగువాడైన రాంమాధవ్ పేరు పరిగణలోకి తీసుకోవచ్చన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోందట.. మరి తెలుగు వాడు మళ్లీ ప్రధాని కావడాన్ని మనమందరం హర్షించకుండా ఉండలేం కదా... కానీ ఇదంతా ముందు జరగాలని కోరుకుందాం..