Begin typing your search above and press return to search.

తెలంగాణ వారు 370ను మిస్ చేసుకున్నారా?

By:  Tupaki Desk   |   1 Sep 2019 4:45 AM GMT
తెలంగాణ వారు 370ను మిస్ చేసుకున్నారా?
X
కొత్త చర్చకు తెర తీసేలా వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. ఆర్టికల్ 370 వరమా? శాపమా? అన్న విషయానికి వస్తే.. రాష్ట్రం ఏదైనా.. తమ వరకూ ప్రత్యేక హోదా ఇస్తుంటే ఎవరికి మాత్రం ఆనందం ఉండదు? కానీ.. రాంమాధవ్ మాత్రం సిత్రమైన వాదనను వినిపించారు. తెలంగాణ ప్రజలు కాస్తంతలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.నిజాం పాలన నుంచి విముక్తి బాధ్యతను నెహ్రూకు కానీ అప్పగించి ఉంటే.. తెలంగాణలోనూ ఆర్టికల్ 370 అధికారణ వచ్చేదన్నారు.

సర్దార్ పటేల్ చొరవతో నిజాం పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిందని చెప్పిన ఆయన.. ఆ కారణంతోనే తెలంగాణ ప్రజలు 70 ఏళ్లుగా స్వేచ్ఛగా బతుకుతున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370ను ప్రమాదకరమైనదిగా అభివర్ణించటం సరైనది కాదు. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ప్రత్యేక గుర్తింపు ఉండటాన్ని ఎవరు మాత్రం ఇష్టపడరు? ఎంత కశ్మీర్ కున్న ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేసినంత మాత్రాన.. అదో పెద్ద బూచీగా చెప్పటం సరికాదనే చెప్పాలి.

ఒకవేళ తెలంగాణకు ఆర్టికల్ 370 ఇస్తామంటే ఆనందంగా ఒప్పుకోవటమే కాదు.. ఇప్పుడు తీస్తామంటే కశ్మీర్ లో మాదిరే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. యావత్ దేశంలో మీరు ప్రత్యేకం. మిగిలిన వారి కంటే భిన్నం. మీ రాజ్యాన్ని మీరే పాలించుకోవచ్చు. కొన్ని అంశాల్లోనే భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న ఆఫర్ ను రాష్ట్రాలకు ఇస్తామని చెప్పమనండి? ఎన్ని రాష్ట్రాలు తమకు 370 అధికరణం ఉండాలని డిమాండ్ చేస్తాయో?

అయితే.. తెలంగాణ విమోచన విషయంలో పటేల్ డీల్ చేసిన వైనాన్ని ప్రశంసించటం తప్పు కాదు. పటేల్ కాకుండా నెహ్రూ కానీ ఈ ఇష్యూలో తలదూర్చి ఉంటే మాత్రం ఏదో ఒక మడతపేచీ పడేది.. అది సుదీర్ఘకాలం సాగేదన్నది నిజం. అంతమాత్రాన ఆర్టికల్ 370 అంటే అదేదో పెద్ద బూచీలా రాంమాధవ్ వ్యాఖ్యానించటం మాత్రం సబబు కాదని చెప్పక తప్పదు. ఇప్పుడు మోడీకి వీరభక్తుడిగా వాదనలు వినిపిస్తున్న రాంమాధవ్.. ఒకవేళ తెలంగాణకు ఆర్టికల్ 370 అమలు ఉండి ఉంటే.. ఆయన మాటలు మరోలా ఉండేవనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పక తప్పదు.