Begin typing your search above and press return to search.

టీడీపీ క్లోజ్... తానాలో మాత్ర‌మే మిగులుతుంద‌ట‌!

By:  Tupaki Desk   |   14 July 2019 11:00 AM GMT
టీడీపీ క్లోజ్... తానాలో మాత్ర‌మే మిగులుతుంద‌ట‌!
X
తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం ద‌క్కిన తెలుగు దేశం పార్టీ ఇక కోలుకునే ప‌రిస్థితి లేద‌న్న వాద‌న‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఈ వాద‌న‌లు నిజ‌మేన‌న్న‌ట్లుగా పార్టీ ఓడ‌గానే... ఆ ఓట‌మికి కార‌ణం చంద్ర‌బాబు, ఆయ‌న సుపుత్రుడు నారా లోకేశ్ లే కార‌ణ‌మ‌ని సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ కీల‌క నేత‌లు పార్టీని వీడుతున్నారు. ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీకి షాకిస్తే... గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ కీల‌క నేత‌, ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్‌... పార్టీకి, పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్సీ ప‌ద‌వికీ రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు.

గుంటూరు జిల్లా టీడీపీకి కీల‌క జిల్లానే క‌దా. ఇలాంటి జిల్లా నుంచి అన్నం స‌తీశ్ ప్ర‌భాక‌ర్ లాంటి నేత‌లు పార్టీని వీడితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ క్ర‌మంలో మున్ముందు టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న అంశంపై బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాం మాధ‌వ్ త‌న‌దైన శైలి కామెంట్లు చేశారు. అది కూడా టీడీపీకి కీల‌క జిల్లాగా ఉన్న గుంటూరు జిల్లా కేంద్రంగానే రాం మాధ‌వ్ ఈ కామెంట్లు చేయ‌డం గ‌మనార్హం. అయినా రాం మాధ‌వ్ ఏమ‌న్నారంటే... టీడీపీ క‌థ కంచికే అని ఆయ‌న తేల్చి పారేశారు. టీడీపీ ఇక‌పై కేవ‌లం తానా స‌భ‌ల్లో మాత్ర‌మే మిగులుతుంద‌ని కూడా ఆయ‌న త‌న‌దైన సెటైర్ వ‌దిలారు.

భయంకరమైన అవినీతితో ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరాలకు నిలయంగా టీడీపీ మారిపోయిందని రాం మాధ‌వ్‌ ధ్వజమెత్తారు. సాధార‌ణంగా ప‌రిస్థితి దిగ‌జారుతుంటే... పెనంలో నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టు ఉంద‌ని అంటారు. అయితే ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిస్థితి అందుకు కూడా కొర‌గాకుండా త‌యారైంద‌న్న కోణంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన రాం మాధ‌వ్‌... పెనం నుంచి పొయ్యిలో పడేందుకు కూడా టీడీపీకి అవకాశం కూడా ఇవ్వరాదని హెచ్చరించారు. మొత్తంగా మొన్న‌టి తానా స‌భ‌ల్లో త‌న‌ను అవ‌మానించిన టీడీపీ అనుకూలురకు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చినట్టుగా వ్య‌వ‌హిరంచిన రాం మాధ‌వ్‌... టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యంపై త‌న‌దైన కామెంట్లు చేసి సంచ‌ల‌న రేపార‌నే చెప్పాలి.