Begin typing your search above and press return to search.

రాంమాధవ్ - మురళీధర్‌ రావు మధ్య రచ్చేంటి..?

By:  Tupaki Desk   |   9 Sep 2019 6:50 AM GMT
రాంమాధవ్ - మురళీధర్‌ రావు మధ్య రచ్చేంటి..?
X
ఇద్ద‌రూ క‌మ‌లం పార్టీలో కీల‌క నేత‌లే.. తెలుగురాష్ట్రాల నుంచి ఎదిగిన‌వారే.. ఇద్ద‌రూ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే.. ఈ మ‌ధ్య వీరిద్ద‌రి మాధ్య ఏదో తెలియ‌ని ఆధిప‌త్య పోరు మొద‌లైంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ వారిద్ద‌రూ ఎవ‌ర‌ని అనుకుంటున్నారా.. ? వారు మ‌రెవ‌రోకాదు.. ఏపీకి చెందిన రాంమాధ‌వ్ - తెలంగాణ‌కు చెందిన ముర‌ళీధ‌ర్‌ రావు. కొంత‌కాలంగా వీరిద్ద‌రి మ‌ధ్య లొల్లిమొద‌లైంద‌నే టాక్ క‌మ‌లం శ్రేణుల్లో వినిపిస్తోంది. అయితే.. ఇందుకు కార‌ణం ఏమిటంటే.. ఒక‌రి ఏరియాలో మ‌రొక‌రు జోక్యం.. అంటే పెత్త‌నం చేయ‌డ‌మేన‌ట‌. రోజురోజుకూ తెలంగాణ‌లో రాంమాధ‌వ్ ప్రాధాన్యం పెరిగిపోతుండ‌డం ముర‌ళీధ‌ర్‌ రావుకు అస్స‌లు న‌చ్చ‌డం లేద‌ట‌.

ఏపీకి చెందిన రాంమాధ‌వ్ ఇక్క‌డ పెత్త‌నం చేయ‌డ‌మేమిటి..? అనే ప్ర‌శ్న ముర‌ళీధ‌ర్‌ రావుతోపాటు ఆయ‌న అనుచ‌రులు - అభిమానుల్లో ఉత్ప‌న్న‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. తెలంగాణ‌లో ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌లు ముగియ‌డం.. ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఏకంగా నాలుగుస్థానాల్లో విజ‌యం సాధించ‌డం తెలిసిందే. ఇక ఇక్క‌డి నుంచి బీజేపీ మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వ‌చ్చే ఎన్న‌కల నాటికి ఎలాగైనా.. తెలంగాణ‌లోపాగా వేయాల‌ని చూస్తోంది. అదే వ్యూహంలో భాగంగా ఆప‌రేష‌న్ ఆక‌ర్శ‌ చేప‌ట్టి కాంగ్రెస్‌ - టీడీపీల‌తోపాటు అధికార టీఆర్ ఎస్ నుంచి కూడా ప‌లువురు కీల‌క నేత‌ల‌ను లాగే ప‌నిలో నిమ‌గ్న‌మయ్యారు క‌మ‌లం పెద్ద‌లు. అయితే..ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు క‌మ‌లం గూటికి చేరారు.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉందికానీ.. చేరేవారంతా కూడా రాంమాధ‌వ్ స‌మ‌క్షంలోనే చేరుతుండ‌డంతో ముర‌ళీధ‌ర్‌ రావులో లోలోప‌ల ఉడికిపోతున్న‌ట్లు తెలుస్తోంది. డీకే అరుణ నుంచి మొద‌లు..చాలా మంది రాంమాధ‌వ్ నేతృత్వంలో ఢిల్లీలో అమిత్‌ షాను క‌లిసి చేరుతుండ‌డంతో ముర‌ళీ అసంతృప్తికి గుర‌వుతున్నట్లు సమాచారం. అయితే.. ఈ ప్ర‌చారాన్ని ఇటీవ‌ల ముర‌ళీధ‌ర్‌ రావు ఖండించారు. త‌న‌కు, రాంమాధ‌వ్ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని చెప్పుకొచ్చారు. కానీ.. ముర‌ళీధ‌ర్‌ రావు మాట‌ల్లో - క‌ద‌లిక‌ల్లో ఎక్క‌డో ఏదో తేడా క‌నిపిస్తుండ‌డంతో అవి పైపైకి చెప్పిన మాట‌లేన‌ని క‌మ‌లం శ్రేణులే గుస‌గుస‌లాడుకోవ‌డం గ‌మ‌నార్హం.

ముర‌ళీధ‌ర్‌ రావు మాట్లాడుతూ ఏపీలో రామ్‌ మాధ‌వ్‌ కు పోటీ లేద‌ని... తెలంగాణ‌లో నాకు చాలా పోటీ ఉంద‌ని కూడా చెప్పారు. అంతేగాకుండా.. తెలంగాణ‌లో బీజేపీ క్ర‌మంగా బ‌లం పుంజుకుంటుండంతో.. ముర‌ళీధ‌ర్‌ రావు ఎక్కువ‌గా హైద‌రాబాద్‌ లోనే ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏకంగా రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి కోసం కూడా ప్ర‌య‌త్నాలు చేస్త‌న్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఇదే స‌మ‌యంలో ప‌లువురు తెలంగాణ నేత‌లు కూడా రాంమాధ‌వ్ ద్వారా అధిష్ఠానం మెప్పుపొంది అధ్య‌క్ష ప‌ద‌విని సంపాదించుకునే ప‌నిలో నిమ‌గ్న‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌ల్లో ఉన్న ఆధిప‌త్య పోరుకు సంకేతాల‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.