Begin typing your search above and press return to search.

30 లక్షలా ఫైనా.... నేను కట్టలేను: డేరా బాబా

By:  Tupaki Desk   |   9 Oct 2017 4:57 PM GMT
30 లక్షలా ఫైనా.... నేను కట్టలేను: డేరా బాబా
X

బ‌య‌ట ఉన్న‌పుడు విలాసాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ కు జైలు జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.30 లక్షల జరిమానాను గుర్మీత్‌కు విధించిన విషయం తెలిసిందే. రెండు నెలల్లోపు ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయితే స్పెషల్ కోర్టు తనకు విధించిన రూ.30 లక్షల జరిమానాను కట్టలేనని పంజాబ్, హర్యానా హైకోర్టుకు తెలిపారు. తాను అన్నింటినీ త్యజించానని, ఈ పరిస్థితుల్లో జరిమానా కట్టడం సాధ్యం కాదని గుర్మీత్ చెప్పినట్లు అతని తరఫు న్యాయవాది గార్గ్ నర్వానా కోర్టుకు చెప్పారు.

ఇప్పటికే అతనికి చెందిన డేరా సచ్చా సౌదా ఆస్తులన్నింటినీ అటాచ్ చేశారని, ఇక గుర్మీత్ ఏవిధంగానూ అంత జరిమానా చెల్లించలేడని నర్వానా చెప్పారు. గుర్మీత్‌ దోషిగా తేలిన తర్వాత పంచకులలో తలెత్తిన అల్లర్లకు హనీప్రీత్‌ ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ఈ అల్లర్ల కోసం హనీప్రీత్‌ ఏకంగా రూ.1.25 కోట్లు ఖర్చు చేసినట్టు కస్టడీలో ఉన్న డ్రైవర్‌ రాకేశ్‌కుమార్‌ వెల్లడించాడు. ఈలావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు.

కాగా, డేరా చీఫ్‌ గుర్మీత్‌ దోషిగా తేలిన అనంతరం అదృశ్యమైన హనీప్రీత్‌ ఏకంగా 17 సిమ్‌కార్డులు మార్చినట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. 38 రోజుల గాలింపు అనంతరం ఈనెల 3న ఆమెను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సాధ్విలపై లైంగికదాడి కేసులో గుర్మీత్‌ ను సీబీఐ ప్రత్యేకకోర్టు ఆగస్టు 25న దోషిగా తేల్చింది. అయితే.. అజ్ఞాతంలో ఉన్న సమయంలో హనీప్రీత్‌ అంతర్జాతీయ సిమ్‌ కార్డులను కూడా వినియోగించారని పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే అన్ని రోజులు ఆమె ఎక్కడ ఉన్నార న్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదని తెలుస్తున్నది. ఆరు రోజుల పోలీసు కస్టడీలో ఉన్న హనీప్రీత్‌ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని తెలిసింది.