Begin typing your search above and press return to search.

ఈ ఏడాదిలో రామమందిరాన్ని కట్టేస్తారా?

By:  Tupaki Desk   |   7 Jan 2016 4:27 AM GMT
ఈ ఏడాదిలో రామమందిరాన్ని కట్టేస్తారా?
X
ఆసక్తికర ఆరోపణలు చేసే కొద్దిమంది నేతల్లో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఒకరు. రాజకీయ ప్రముఖులపై ఆరోపణలు చేయటమే కాదు.. వారిని కోర్టుకు ఈడ్చటం స్వామికే చెల్లు. స్వామి నోటి వెంట.. ఎవరైనా నేతకు సంబంధించి అవినీతి మాట వచ్చిందంటే వారికి మూడినట్లే భావిస్తారు. నాటి బోఫోర్స్ మొదలు నిన్నటి 2జీ స్కాం.. నేటి నేషనల్ హెరాల్డ్ వరకూ ఆయన ఆరోపణలు ఎంత బలంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి నేత నోట అయోధ్య రామాలయం వ్యవహారానికి సంబంధించి వ్యాఖ్యలు వచ్చాయంటే కాస్తంత అటెన్షన్ ప్రదర్శించాల్సిందే.

ఈ మధ్య కాలంలో వీహెచ్ పీ నేతలు.. కొందరు బీజేపీ నేతలు అయోధ్యలో రామాలయానికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్వామి మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరకు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామంటూ కలకలం రేపారు. రామ మందిర నిర్మాణానికి సంబంధించిన పనులు ఆగస్టు.. సెప్టెంబరులో మొదలు పెడతామన్నారు. అయోధ్య రామాలయానికి.. రాజకీయాలకు సంబంధం లేదంటూనే.. ఆలయ నిర్మాణాన్ని కోర్టు తీర్పు తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

కోర్టు తీర్పునకు అనుగుణంగా రామాలయాన్ని నిర్మించేదే నిజమైతే.. ఈ ఏడాది చివరి నాటికి రామాలయాన్ని నిర్మిస్తామని స్వామి ఎలా చెప్పగలుగుతారు? కేవలం ఏడెనిమిది నెలల వ్యవధిలోనే.. దశాబ్దాల నుంచి సాగుతున్న అయోద్య లొల్లిని కోర్టు తేలుస్తుందని స్వామి భావిస్తున్నారా? అన్నది ప్రశ్న. రాముడికి.. రాజకీయాలకు సంబంధమే లేకుంటే అసలు లొల్లే లేదు? రాముడికి.. రాజకీయాలకు సంబంధం లేదన్న స్వామి మాటలే నిజమైతే.. మరింత కాలం జరిగిందేమిటి స్వామి..?