Begin typing your search above and press return to search.

ఆదినారాయ‌ణ‌రెడ్డికి రామ‌సుబ్బారెడ్డి స‌వాల్‌

By:  Tupaki Desk   |   1 Jan 2016 3:30 PM GMT
ఆదినారాయ‌ణ‌రెడ్డికి రామ‌సుబ్బారెడ్డి స‌వాల్‌
X
క‌డ‌ప జిల్లా జ‌మ్ముల‌మ‌డుగు రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. ఇక్క‌డ నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తున్న వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి కొద్ది రోజులుగా టీడీపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే రెండు రోజుల క్రితం ఆయ‌న కూడా తాను టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌ట‌న చేశారు. దీనిపై టీడీపీ అధిష్టాన‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌న త‌న వైపు నుంచి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఆది ప్ర‌క‌ట‌న‌తో చంద్ర‌బాబు ఓకే చెపితే ఆయ‌న పార్టీలో చేర‌డానికి రెఢీగా ఉన్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అయితే ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీలో చేర‌డం ఇష్టం లేని టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి కొద్ది ఆది చేరిక‌ను అడ్డుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌య‌మై ఆయ‌న ఇప్ప‌టికే చంద్ర‌బాబు - లోకేష్‌ - బాల‌కృష్ణ‌ను క‌లిసి జ‌మ్ముల‌మ‌డుగు ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లో త‌మ కుటుంబం ఎంతోమందిని కోల్పోయింద‌ని..ఇప్పుడు ఆదినారాయ‌ణ‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే త‌మ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ విష‌యంపై చంద్ర‌బాబు కూడా స‌రైన న్యాయం చేస్తాన‌ని రామ‌సుబ్బారెడ్డికి హామీ ఇచ్చారు.

అయితే తాజాగా శుక్ర‌వారం రామ‌సుబ్బారెడ్డి ఆదినారాయ‌ణ‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప‌లు కేసుల్లో ఉన్న తన వియ్యంకుడు కేశవరెడ్డిని కాపాడేందుకే... ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. త‌న‌ను పెంచి పోషించిన వైఎస్ కుటుంబానికి ఆదినారాయ‌ణ‌రెడ్డి ద్రోహం చేస్తున్నార‌ని...విడాకులు తీసుకోకుండా మరో పెళ్లికి సిద్దమైనట్లుగా.... తన పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారతాననడం ఎంత వరకు సబబని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రామసుబ్బారెడ్డి స‌వాల్ విసిరారు. ఆదినారాయ‌ణ రెడ్డికి రామ‌సుబ్బారెడ్డి స‌వాల్‌ తో జ‌మ్ముల‌మ‌డుగు రాజ‌కీయం వేడెక్కిది. ఇప్పుడే ఉప్పు-నిప్పుగా ఉంటున్న వీరిద్ద‌రు రేపు ఒకే పార్టీలో ఉండ‌డం క‌ష్ట‌మేన‌న్న టాక్ జిల్లా పాలిటిక్స్‌ లో వినిపిస్తోంది.

ఆదినారాయణరెడ్డి - జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన వెంట ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత కొన్ని పరిణామాల్లో పార్టీ తనకు అండగా నిలవలేకపోయిందన్న అభిప్రాయం ఆయనలో ఏర్పడింది. అప్పటినుంచి వైకాపాకు దూరం జరిగారు. పార్టీకార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనడం లేదు. సరికదా వైఎస్ జగన్ మీద ఇప్పటికే పలు ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. జగన్ ఒంటెత్తు పోకడలు పోతున్నారని ఆయన ఎవ్వరి మాటలను చెవిలోవేసుకునే స్థితిలో లేరని ఆదినారాయణ రెడ్డి గతంలో పలుమార్లు విమర్శించారు. ఇటీవ‌ల జ‌గ‌న్ జ‌మ్ముల‌మ‌డుగు ప‌ర్య‌ట‌న చేసినా ఆదినారాయ‌ణ‌రెడ్డి రాక‌పోవ‌డంతో ఆయ‌న ఇక వైకాపాను వీడ‌డం ఖాయమైంది. అయితే తాజాగా రామసుబ్బారెడ్డి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆదినారాయ‌ణ‌రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.