Begin typing your search above and press return to search.

షాద్‌ నగర్ జంట హత్యల కేసు..రామసుబ్బారెడ్డికి రిలీఫ్

By:  Tupaki Desk   |   26 July 2019 4:59 AM GMT
షాద్‌ నగర్ జంట హత్యల కేసు..రామసుబ్బారెడ్డికి రిలీఫ్
X
సుమారు 28 ఏళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన షాద్ నగర్ జంట హత్యల కేసు ఆ తరువాత కాలంలో రాయలసీమలో.. ముఖ్యంగా కడప జిల్లాలో ఇప్పటికీ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేస్థాయి విభేదాలకు కారణమైన సంగతి తెలిసిందే. ఇద్దరు మాజీ మంత్రులకు సంబంధించిన ఈ కేసును తాజాగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డికి ఊరట లభించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 1990 డిసెంబరు 5వ తేదీ రాత్రి మహబూబ్‌ నగర్‌ జిల్లా షాద్‌ నగర్‌ బస్టాండు సమీపాన ప్రస్తుత మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పెద్దనాన్న - చదిపిరాళ్ల శివశంకర్‌ రెడ్డి - లక్కిరెడ్డి భీమగుండం గోపాల్‌ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి 11 మందిపై కేసు నమోదైంది. కేసు నమోదు అయిన వారిలో పొన్నపురెడ్డి శివారెడ్డి - పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి - జంబాపురం వెంకటరామిరెడ్డి - జంబాపురం వేమనారాయణరెడ్డి - జంబాపురం వెంకటనారాయణరెడ్డి - జంబాపురం శివరామిరెడ్డి - ధనిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి - ధనిరెడ్డి రామమోహన్‌ రెడ్డి - నరహరి విశ్వేశ్వర్‌ రెడ్డి - నరహరి సాంబశివారెడ్డి - లకుండే వెంకటరమణ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డికి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు అప్పటి జడ్జి రాజగోపాల్‌ రెడ్డి యావజ్జీవకారాగార శిక్ష విధించారు. దీంతో 2004 డిసెంబరు 22వ తేదీ రామసుబ్బారెడ్డి జైలుకు వెళ్లారు. 23 నెలల తర్వాత అంటే 2006 నవంబరు 11వ తేదీ అప్పటి జడ్జి బిలాల్‌ నజికి హైకోర్టులో కేసు కొట్టివేయడంతో రామసుబ్బారెడ్డి బయటికి వచ్చారు. ఆ తీర్పుపై అప్పట్లో ఆదినారాయణరెడ్డి తమ్ముడు శివనాధరెడ్డి సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. అప్పటి నుంచి కేసు నడిచింది.

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆ కేసులో నిందితునిగా ఉన్నారు. అయితే గురువారం సుప్రీంకోర్టులో జడ్జిలు నవీన్‌ సిన్హా - అశోక్‌ భూషణ్‌ జంటహత్యల కేసును కొట్టివేయడంతో కేసులోని వారంతా నిర్దోషులుగా బయటపడ్డారు. 1990 డిసెంబరు 5న జరిగిన ఘటనకు సంబంధించి 11 మంది నిందితుల్లో ప్రస్తుతం మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో పాటు నరహరి విశ్వేశ్వరరెడ్డి - జంబాపురం వేమనారాయణరెడ్డి - జంబాపురం శివరామిరెడ్డి మాత్రమే ఉన్నారు. మిగతావారు రకరకాల కారణాలతో మరణించారు.

కొద్దికాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు ఒకే పార్టీలో ఉండడం.. ఇప్పుడు కోర్టు ఈ కేసును కొట్టివేయడంతో జమ్మలమడుగులో ఈ కేసుకు సంబంధించిన ఉద్రిక్తతలు చాలావరకు తగ్గాయనే చెప్పాలి.