Begin typing your search above and press return to search.

బాబుకు షాక్.. జగన్ ను కలిసిన రామసుబ్బారెడ్డి

By:  Tupaki Desk   |   21 Oct 2019 4:50 AM GMT
బాబుకు షాక్.. జగన్ ను కలిసిన రామసుబ్బారెడ్డి
X
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన రీతిలో ఓటమిపాలైన బాబుకు.. ఏపీ ప్రజలు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే.. అధికారంలో ఉన్నప్పుడు బాబు వెంట ఉన్న పలువురు ఒక్కొక్కరుగా వెనుదిరగటం తెలిసిందే. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా వ్యవహరించిన సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లు మొదలుకొని.. ఆయన వెంట ఉన్న పలువురు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.

అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఒత్తిడి రాజకీయాలు చేసి పార్టీలోకి తీసుకొచ్చిన వారంతా ఇప్పుడు వెళ్లిపోవటంతో.. మొదట్నించి పార్టీలో పని చేసిన వారే బాబుకు దిక్కు అవుతున్నారు. తామెంత కష్టపడినా ఫలితం దక్కకపోవటంతో గతంలో పలువురు నేతలు పార్టీని విడిచి వెళ్లిపోయారు.

గతంలో చేసిన తప్పులకు వర్తమానంలో శిక్ష అనుభవిస్తున్న చంద్రబాబుకు తాజాగా ఊహించని షాక్ తగిలింది. కడప జిల్లాలో బలమైన నేతగా ఉంటూ.. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా అధినేత నుంచి ఎలాంటి అండ దొరకని రామసుబ్బారెడ్డి తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాజాగా విమానాశ్రయంలో జగన్ ను కలిసిన ఆయన్ను.. ముఖ్యమంత్రి ఆత్మీయంగా పలుకరించారు.

రామసుబ్బారెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయిన ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి.. మంత్రి పదవిని అప్పగించటం.. మొదట్నించి పార్టీలో ఉన్న రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవితో సరిపుచ్చటం లాంటివి చేసిన చంద్రబాబు తీరుతో ఆయన గుర్రుగా ఉన్నారని చెబుతారు. పార్టీలో ఎంతోకాలం ఉన్నా.. పార్టీ కోసం ఎంతో కష్టపడినా ఇప్పటివరకూ సరైన బ్రేక్ రాలేదన్న బాధలో ఉన్న రామసుబ్బారెడ్డి.. సీఎం జగన్ ను ఎందుకు కలిశారు? దాని వెనుకున్న రాజకీయ కారణం ఏమిటి? అన్నది తేలాల్సి ఉంది. ఏమైనా.. జగన్ ను రామసుబ్బారెడ్డి కలిశారంటే.. రానున్న రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయం. ఇవన్నీ బాబుకు షాకులుగా మారనున్నాయని చెబుతున్నారు.