Begin typing your search above and press return to search.

స్టేషన్‌ లోనే కుమ్మేసుకున్నారు…

By:  Tupaki Desk   |   17 Aug 2016 11:27 AM GMT
స్టేషన్‌ లోనే కుమ్మేసుకున్నారు…
X
ఫిరాయింపుల ఫలితంగా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు సాగుతునే ఉన్నాయి. చంద్రబాబు కౌన్సెలింగులతో నేతలు శాంతించినట్లుగా పైకి కనిపిస్తున్నా అప్పుడప్పుడు విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీలో నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు కనిపిస్తున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో ఇవి మరింత పెరిగాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటాయి ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డి మధ్య సంబంధాలు. కానీ... రామసుబ్బారెడ్డి అభ్యంతరాలను పట్టించుకోకుండా చంద్రబాబు మాత్రం ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తెచ్చారు. తెచ్చాక రెండు వర్గాలు పలుమార్లు కుమ్ములాడుకున్నాయి. దాంతో చంద్రబాబు - లోకేశ్ లు జోక్యం చేసుకుని సంధి కుదిర్చారు. ఆ కారణంగా కొద్దికాలంగా అక్కడ పరిస్థితి చల్లబడింది. అయితే... లోలోపల రగులుతున్న ఆగ్రహావేశాలు చల్లారలేదని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి.

తాజాగా జమ్మలమడుగు టీడీపీలో మరోసారి అధిపత్యపోరు బహిర్గతమైంది. గ్రామాల్లో ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డి వర్గాలు సై అంటే సై అనుకుంటున్నాయి. తాజాగా తాళ్లపొద్దుటూరులో ఇరు నాయకుల అనుచరులు తలబడ్డారు. నీరు- చెట్లు నిధులు పంచుకునే విషయంలో మొదలైన గొడవ స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడా సెటిల్‌ మెంట్‌ సాధ్యం కాకపోవడంతో ఇరు వర్గాలు పోలీసుల సమక్షంలోనే కొట్టుకున్నారు. దాడిలో రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన 10 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తేరుకున్న పోలీసులు వెంటనే లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాగా విషయం వెంటనే చంద్రబాబుకు చేరడంతో ఆయన సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరూ వినడం లేదని.. కార్యకర్తలను అదుపులో పెట్టుకోవడం లేదని ఆయన ఆగ్రహించినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి ఇద్దరు నేతలను పిలిచి గట్టిగా వార్నింగు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.