Begin typing your search above and press return to search.

ప్ర‌మాదంలో రామ‌గుండం ఫ్యాక్ట‌రీ ! అమ్మేస్తారా ?

By:  Tupaki Desk   |   30 May 2022 1:30 PM GMT
ప్ర‌మాదంలో రామ‌గుండం ఫ్యాక్ట‌రీ ! అమ్మేస్తారా ?
X
భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం లోప‌మా లేదా నెప‌మా? అన్న ప్ర‌శ్న రామ‌గుండం ఎరువుల త‌యారీ ఫ్యాక్ట‌రీకి సంబంధించి వినిపిస్తోంది.దేశంలో చాలా ఫ్యాక్ట‌రీలకు లేని కాలుష్య నిబంధ‌న‌లు ఇవాళ ఇక్క‌డే ఎందుకు ప్రాధాన్యాంశంగా తెర‌పైకి వ‌చ్చింది.అంటే ఈ ఫ్యాక్ట‌రీని కూడా కేంద్రం త‌మ‌కు అనుగుణంగా ఉండే వ‌ర్గాల‌కు అమ్మేస్తుందా అన్న వాద‌న ఒక‌టి ఓ వ‌ర్గం నుంచి వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే రామ‌గుండం ఎరువుల ఫ్యాక్ట‌రీ మూత వేయించేందుకు చ‌ర్య‌లు ఊపందుకున్నాయా అన్న సందేహాలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల క‌ర్మాగారం నుంచి గ్యాస్ లీకేజీ కార‌ణంగా ఇక్క‌డి ఫ్యాక్టరీపై ఫిర్యాదులు వ‌చ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ ఏకంగా 12లోపాల‌ను గుర్తించింది. వీటిని వెంట‌నే స‌రిదిద్దాల‌ని అప్ప‌టిదాకా ఫ్యాక్ట‌రీ మూసి వేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడిదే పెద్ద‌ప‌ల్లిలో చ‌ర్చ‌కు తావిస్తోంది. యావ‌త్ తెలంగాణ రాష్ట్రానికీ ఎరువులు అందించే ఫ్యాక్ట‌రీని కొన్ని లోపాల పేరిట ఇప్ప‌టికిప్పుడు మూసి వేస్తే ఖ‌రీఫ్ స‌మ‌యానికి త‌మ గ‌తేం కావాల‌ని రైతులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇదంతా ఓ జాతీయ పార్టీ అడుతున్న నాటకం అని ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టీకే ఆ పార్టీకీ, తెలంగాణ రాష్ట్ర స‌మితికీ ప‌డ‌డం లేద‌ని, అందుకే ఈ విధంగా నిబంధ‌న‌ల పేరిట ఆపుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది.

వాస్త‌వానికి ఈ ఫ్యాక్ట‌రీని నిబంధ‌న‌ల పేరిట మూసివేసి, త‌రువాత ఏద‌యినా కార్పొరేట్ కంపెనీకి ద‌క్కే విధంగా చేస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏ నాటి నుంచి తెలంగాణ అనే కాదు ఆంధ్రా అవ‌స‌రాల‌ను కూడా తీరుస్తున్న ఫ్యాక్ట‌రీ మూత‌ప‌డితే వేల కుటుంబాలు రోడ్డున ప‌డ‌తాయి. రైతుల‌ జీవితాలు అగమ్య గోచ‌రం అవుతాయి. ఇప్ప‌టికే దీనిపై ఆధార ప‌డి ఉన్న కుటుంబాలు తాజా నిర్ణ‌యంతో డైల‌మాలో ప‌డ్డాయి. ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం త‌క్షణ‌మే స్పందించి గ్యాస్ లీకుల నివార‌ణ‌కు మ‌రియు ఇత‌ర లోపాలను స‌రిదిద్దేందుకు త‌గిన ప్రాధాన్యం ఇచ్చి, ఫ్యాక్ట‌రీని వీలైనంత త్వ‌ర‌గా తిరిగి ప్రారంభించాల‌ని వీరంతా వేడుకుంటున్నారు.